నేల మీద మనుషులకే కాదు, నీళ్లలోని చేపలకూ జాతి భేదాలుంటాయి. ఒకదానితో మరోదానికి పడని తగాదాలుంటాయి. ఒక ప్రాంతానికి అలవాటుపడిన మనుషులు కొత్త ప్రాంతాలకు వెళ్తే ఎలాగో… అలాగే చేపలుకూడా ఇబ్బందులు పడతాయి. పోయినేడాది వచ్చిన వరదల దెబ్బకు కేరళ జాలర్లకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వాళ్లు వల వేస్తుంటే… ఇంతవరకు చూడని చేపలు పడుతున్నాయట! త్రిసూర్కి సమీపంలోని కొడంగలూరులో పింక్, క్రీమ్ కలర్ కలిసిన రంగుతో చదునైన తలతో ఉన్న చేపలు దొరుకుతున్నాయంటున్నారు అక్కడి జాలర్లు. వల బరువు అనిపిస్తే పంట పండిందని సంబరపడతారు. తీరా, బయటకు లాగేసరికి ఆరడుగుల పొడవు, 40 కిలోల బరువు చేపలు కనపడి కంగారు పడుతున్నారు.
తిరువనంతపురంలోని కేరళ యూనివర్శిటీవాళ్లు ఈ చేపల టిష్యూలు తీసుకెళ్లి పరిశోధించగా, ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసొచ్చాయి. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో సంచరించే అరపైమా జాతి చేపలుగా గుర్తించారు. ఎక్కడి లాటిన్ అమెరికా, ఎక్కడి కేరళ? అలాగే, మరో కొత్త రకం అలిగేటర్ గార్. ఇది ఉత్తర అమెరికాలోని స్వచ్ఛమైన సరస్సులలో పెరిగే రకం. ఇవన్నీ కేరళలో వరదలతో పొంగిపొర్లిన పెరియార్, ముత్తుపుళ, కరుమలి, చలక్కుడి నదుల్లో దొరుకుతున్నాయి. అయితే, పరిశోధనలో తేలిందేమిటంటే, ఈ విదేశీ రకం చేపల్ని కేరళలో అక్రమంగా పెంచుతున్నారు. పోయినేడాది వరదల్లో ఆక్వా చెరువులు దెబ్బతినడంతో అక్కడ పెంచుతున్న చేపలన్నీ సమీపంలోని నదుల్లోకి వచ్చేశాయి.
ఇప్పటివరకు ఎన్ని చోట్ల నుంచి ఇవి కొట్టుకొచ్చాయన్న వివరాలేవీ తెలియడం లేదు. వరదలొచ్చిన నాలుగు నదుల్లోనే ఇవి కనబడ్డాయి. వీటితోపాటు సూదితోక రకం, జెయింట్ గౌరమీ రకంలాంటి కొన్ని ఆర్నమెంటల్ రకం విదేశీ చేపలుకూడా దొరుకుతున్నాయి. చాలా డేంజర్ జాతికి చెందిన ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఒకటి రెండు చోట్ల కనిపించింది. కాబట్టి, అక్రమ ఆక్వా కల్చర్‌పై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు సైంటిస్టులు. క్లారియస్ గారీపైనస్గా పిలిచే క్యాట్‌ఫిష్ ఎక్కువగా గుడ్లు పెడుతుంది. చాలా తొందరగా పెరుగుతుంది, ఈ రకాన్ని ఇడుక్కి జిల్లాలోని ఆనయిరంగల్, మట్టుపెట్టి, పెరియార్ రిజర్వాయర్లలో ఆక్వేరియమ్లలో పెంచుకోవాలనే ఆసక్తిగలవారికోసం పెంచుతున్నారు. ఆక్వా చెరువుల్లో ముందుగా బ్రీడింగ్ చేసి, తర్వాత దగ్గరలోని కాలువల్లో వలలతో ప్రత్యేకంగా కొంత ఏరియాని తయారుచేసుకుని, వాటిలోకి వదులుతారు. మొదట్లో ఆరపైమా, అలిగేటర్ గార్లనుకూడా ఆక్వేరియమ్ ట్యాంక్లకోసమే పెంచారు. కొంతకాలానికి అవి ట్యాంక్‌ని మించిపోతుంటాయి. దాంతో సమీపంలోని కాలువలోకో, నదిలోకో తీసుకెళ్లి వదిలించుకుంటారు. కేరళ నదుల్లో సుమారు 200 రకాల చేపలు దొరుకుతాయి. వీటిలో 30 వరకు పూర్తిగా ఆ నదుల నీళ్లకే అలవాటు పడ్డ జాతులు. అక్రమంగా సాగు చేస్తున్న ఆక్వా రకాలవల్ల వీటి ఉనికికి ముప్పు వస్తుందంటున్నారు.
పోయినేడాది కేరళలో వరదలకు నదులన్నీ పొంగిపొర్లాయి. దగ్గరలోని చేపల చెరువులన్నీ కట్టలు తెంచుకున్నాయి. వాటిలో అక్రమంగా పెంచుతున్న విదేశీ రకం చేపలుకూడా కొట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా గుడ్లు పెట్టడమే కాకుండా, దగ్గరలోని చిన్న చేపల్ని తింటూ తొందరగా పెరిగిపోతాయి. వీటినిలాగే వదిలేస్తే కేరళ జాలర్ల బతుకుతెరువు దెబ్బతింటుందంటున్నారు సైంటిస్టులు.