- లేట్ అయితే చేపలు ఎదగవంటున్న మత్స్యకారులు
- ఎన్నికల మూడ్ లో ఎమ్మెల్యేలు.. ఆఫీసర్ల వెయిటింగ్
- ఆందోళనలో మత్స్యకారులు
ఆసిఫాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల బిజీ షెడ్యూల్ తో ఆసిఫాబాద్ జిల్లాలో చేపల పెంపకం నిలిచిపోయింది. వానాకాలం మొదలైన కొద్ది రోజులకు చెరువులు, ప్రాజెక్టుల్లో వదలాల్సిన సబ్సిడీ చేప పిల్లలను ఆగస్టు నెల దాటుతున్నా ఇంకా ఎక్కడా వేయలేదు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు. చేప పిల్లల టెండర్లు కంప్లీట్ చేసి తాము రెడీగా ఉన్నామని, ఎమ్మెల్యేల బిజీ షెడ్యూల్ కారణంగా ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించలేదని ఆఫీసర్లే చెప్తున్నారు.
టార్గెట్ కోటీ 45 లక్షలు
జిల్లాలో మత్స్య శాఖ అధ్వర్యంలో 280 చెరువులు, కుంటలను గుర్తించారు. కుమ్రంభీం, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టుల్లోనూ చేప పిల్లలను వదలాల్సి ఉంది. జిల్లాలో 60 మత్స్యకార సంఘాల్లో ఉన్న 3,500 సభ్యులతోపాటు మరో 1500 మంది చేపల అమ్మకం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. వీరి ఉపాధిని దృష్టిలో ఉంచుకొని 2023-–24లో సీజన్లో రూ.కోటి 68 లక్షల వ్యయంతో ఒక కోటీ 45 లక్షల చేప పిల్లలు టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా ముందడుగు వేసినా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగా వానాకాలం దాటుతున్నా ప్రారంభం కానీ దుస్థితి నెలకొంది.
లేట్ చేస్తే చేపలు ఎదిగేదెలా..?
జిల్లాలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్ లు నిండాయి. చెరువు, కుంటల్లో 35 నుంచి 45 మీల్లీమీటర్ల సైజు, ప్రాజెక్టులలో 80 నుంచి 100 మీ.మీ. సైజ్ చేప పిల్లలు వదలనుండగా ఇవి పెరిగేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అయితే, చేప పిల్లలను లేట్‌గా వదిలితే అవి పెరిగే వరకు నీళ్లు నిండుగా ఉంటాయో లేదోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు సప్లయ్ చేస్తున్న రవ్వు, బొచ్చ, బంగారు తీగ, మ్రిగాల చేప పిల్లలు పెరుగుదలకు ఇప్పుడు వదలడమే మంచిదని అధికారులు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు టైం లేకపోవడంలో ఈ ప్రాసెస్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఇప్పటికైనా నేతలను సమన్వయం చేసి చేపలను వదిలేందుకు ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు.
లేటుగా వేస్తే చేపలు పెరగడం లేదు
చేప పిల్లలు సరైన సమయంలో వదలకుండా లేటు చేస్తే అవి పూర్తిగా ఎదుగవు. ఆగస్టులోపే చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలితే సీజన్ నాటికి అవి పెరుగుతాయి. గతేడాది కూడా లేట్ కావడంతో చేపలు అరకిలో వరకు మాత్రమే పెరిగాయి. దీంతో మత్స్యకారులకు నష్టం జరిగింది. ఈ ఏడాది వానలు అంతంతే ఉన్నాయి. చేపలు ఎదగాలంటే ఇప్పుడే వాటిని వదలాలి. లేదంటే నీళ్లు తగ్గిపోయి ఎదుగుల ఉండదు.
ఎడ్ల భీమయ్య, మత్స్యకారుల సంఘం మండల అధ్యక్షుడు, కౌటాల
ఎమ్మెల్యేలు టైం ఇస్తలేరు
చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టుల్లో వదిలేందుకు ఎమ్మెల్యేలు టైం ఇస్తలేరు. బిజీగా ఉన్నం అని చెప్తున్నరు. టెండర్ల ప్రక్రియ కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు టైం ఇస్తే వెంటనే చేప పిల్లలు వదులుతం.
విజయ్, మత్స్యశాఖ, ఏడీ