చేపల పెంపకంతో జీవనోపాధి

  • మహిళ సంఘాల ఆధ్వర్యంలో యూనిట్ల ఏర్పాటు 
  • చేపల పెంపకంతో ఫ్యామిలీలకు ఆర్థిక చేయూత
  • స్టేట్​లో కామారెడ్డి జిల్లాలోనే ఫస్ట్​
  • ఇప్పటికే 31 యూనిట్లు గ్రౌండింగ్​

కామారెడ్డి, వెలుగు: ఫ్యామిలీకి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో  చేపల పెంపకం చేపడుతున్నారు. బ్యాంకుల​ ద్వారా లోన్లు తీసుకొని వ్యవసాయానికి అనుబంధంగా  చేపల పెంపకం చేపట్టేలా కలెక్టర్​ జితేశ్‌ వి.పాటిల్​ ప్రత్యేక చొరవ తీసుకొని స్టేట్‌లోనే కామారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా అమలు చేయిస్తున్నారు. ఇప్పటికే  31 యూనిట్లు గ్రౌండింగ్​ అయ్యాయి.   

మహిళా సంఘాల ఆధ్వర్యంలో

జిల్లాలో 16,941 మహిళ సంఘాల్లో 1,74,091 మంది సభ్యులు ఉన్నారు.  ఆర్థిక అవసరాల కోసం సభ్యులు లోన్లు తీసుకుంటున్నారు.   తీసుకున్న లోన్లను  వ్యవసాయానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.   కొందరు షాపులు, మరికొందరు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు.  తక్కువ వ్యవసాయ భూమి ఉండి,  నీటి వసతి కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతుల కుటుంబాల మహిళలు అగ్రికల్చర్‌‌కు అనుబంధంగా చేపల పెంపకం చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని కొద్దిరోజుల కింద డీఆర్​డీవో ఆఫీసర్లను  కలెక్టర్​ ఆదేశించారు. ఆఫీసర్ల చొరవతో 408 మంది సభ్యులు తమ వ్యవసాయ  భూముల్లో   చేపల పెంపకం చేపట్టడానికి ముందుకొచ్చారు.  వీరికి  ట్రైనింగ్​ ఇచ్చారు.  బ్యాంకుల ద్వారా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు లోన్లు తీసుకున్నారు. చేపల పెంపకానికి 3 గుంటల భూమి అవసరం.  ఫామ్​ఫాండ్​ నిర్మాణం, బోర్​ నుంచి నీరు వచ్చేలా ఏర్పాట్లు, వలలు,  వెయ్యి కిలోల నుంచి 4వేల కిలోల వరకు చేప పిల్లల కొనుగోలు, దాణా కోసం లోన్​ అమౌంట్​ వినియోగిస్తున్నారు.  చేప పిల్లలు తీసుకొచ్చి కొద్ది రోజులు టబ్​లో ఉంచి ఆ తర్వాత ఫామ్​పాండ్లో వేస్తున్నారు.  రోజు 2 నుంచి 3 గంటల పని ఉంటుంది.  8 నెలల్లో దిగుబడి వస్తుంది.  

మార్కెటింగ్​ సౌకర్యాలు

మహిళా సంఘాల సభ్యులు పెంచిన చేపలను స్థానికంగా అమ్ముకోవడంతోపాటు బల్క్​గా ఇతర ఏరియాలకు సప్లై చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా హైదరాబాద్​కు దగ్గరగా ఉంటుంది.  చేప పిల్లలు సప్లై చేసినవారే తిరిగి వాటిని కొనేలా అవగాహన ఒప్పందం కుదిర్చారు.  దీంతో  మార్కెటింగ్ సమస్యలు లేవు.  వెయ్యి చేపలు పెంచితే  8 నెలల్లో  పెట్టిన పెట్టుబడులు పోను రూ.లక్ష వరకు లాభం వస్తుందని ఆఫీసర్లు పేర్కొన్నారు. 

ఇప్పటికే  ఏడు మండలాల్లో  గ్రౌండింగ్​

జిల్లా వ్యాప్తంగా 408 యూనిట్లు ఏర్పాటు చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.  ఇందులో ఇప్పటికే ఏడు మండలాల్లో  31 యూనిట్లు గ్రౌండింగ్​ అయ్యాయి.  చేప పిల్లలు తీసుకొచ్చి  ఫామ్​పాండ్స్​లో వేశారు.   మహిళ సంఘాల ఆధ్వర్యంలో  చేపల పెంపకం స్టేట్‌లో కామారెడ్డి జిల్లాలోనే చేపట్టినట్లు ఆఫీసర్లు తెలిపారు.  గాంధారి, లింగంపేట మండలాల్లో  7 చొప్పున,   దోమకొండలో 6, సదాశివనగర్​లో 5,  మాచారెడ్డిలో 3, రాజంపేటలో 2, నాగిరెడ్డిపేటలో ఒక యూనిట్​ ఏర్పాటు చేశారు. 

 నాలుగు వేల చేప పిల్లలు పెంచుతున్నాం

నాలుగు వేల చేప పిల్లలు పెంచుతున్నాం.  డ్వాక్రా సంఘం, బ్యాంక్​ ద్వారా వచ్చిన లోన్​తో  ఫామ్​పాండ్​నిర్మించి,  వలలు, దాణా, చేప పిల్లలు కొనుకొచ్చాం. ఆఫీసర్లు వాటిని ఎలా పెంచాలనే దానిపై ట్రైనింగ్​ ఇచ్చిన్రు. ఎప్పటికప్పుడు వచ్చి చూస్తున్రు.   కుటుంబానికి ఆసరా అవుతుందని చేప పిల్లల పెంపకం చేపట్టాం.  యూనిట్​ ఏర్పాటు చేసి 2 నెలలయింది. 
–నిర్మల, భూంపల్లి

ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత

మహిళలు ఆర్థికంగా ఎదిగాలన్న ఉద్దేశంతో జిల్లాలో చేపల పెంపకం చేపట్టాం.  కలెక్టర్​ ప్రత్యేక  చొరవతో చేపల పెంపకాన్ని  మహిళ సంఘాల ప్రతినిధులతో చేపట్టాం.  8 నెలల్లోనే వారు పెట్టిన పెట్టుబడి పోను ఒక్కొక్కరికి కనీసం రూ. లక్ష వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దాణా ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నాం.  త్వరలో మహిళ సంఘాల ఆధ్వర్యంలోనే తయారీ చేయిస్తాం.
–సాయన్న, డీఆర్​డీవో, కామారెడ్డి