చికెన్ వేస్టేజ్‌తో చేపల పెంపకం.. తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు

  • ‘గంగ చేపలు’గా అమ్ముతున్న వైనం
  • విషంగా మారుతున్న ఫిష్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో చికెన్​ వేస్టేజ్​తో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దాణాగా అందిస్తున్నారు. పక్కనే గోదావరి ఉండడంతో వీటిని ‘గంగ చేపలు’గా చెప్పి అమ్ముతున్నారు. వాస్తవానికి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. కానీ చికెన్​ వేస్టేజ్​తో పెంచిన ఈ చేపలు తింటే మాత్రం రోగాలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం, కాచనపల్లి, భీమారం, పోలంపల్లి, దొనబండ గ్రామాల్లో  కొన్నేళ్లుగా చేపలు పెంచుతున్నారు. ఇందారంలో గోదావరి ఒడ్డున సుమారు 40 ఎకరాల్లో, మిగిలిన గ్రామాల్లో 20 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. ఆంధ్రాకు చెందిన కొంతమంది ఇక్కడి రైతుల దగ్గర వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని చేపల చెరువులు చేశారు. జెల్ల రకానికి చెందిన చేపలను ఎక్కువగా పెంచుతున్నారు. చేపలకు ఆరోగ్యకరమైన జొన్న, మొక్కజొన్నతో పాటు పలు రకాల పిండిని మేతగా వేస్తారు. కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలనే అత్యాశతో చికెన్ వేస్టేజ్ వేసి చేపలను పెంచుతున్నారు. మంచిర్యాల, గోదావరిఖనిలోని చికెన్​ సెంటర్ల నుంచి చికెన్​ వేస్టేజ్​​ పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు.

డేంజర్​ రోగాలు..

ఈ చేపలను మంచిర్యాల, గోదావరిఖనికి మార్కెట్లలో, గ్రామాల్లో జరిగే వారసంతల్లో  ‘గంగ చేపలు’గా చెప్పి అమ్ముతున్నారు. కుళ్లిన కోడి మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన చేపలు విషతుల్యంగా మారుతాయని, ఇవి తింటే ప్రమాదకరమైన రోగాలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కానీ సంపాదనే లక్ష్యంగా చేపలు పెంచుతున్నవారు ఇవేమీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. భీమారం తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్​కు దగ్గరలోనే చికెన్ వేస్టేజ్ వేసి చేపలు పెంచుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. గతంలో ఇందారంలో గోదావరి ఒడ్డున గల చెరువుల్లో, దొనబండలో చికెన్​ వేస్టేజ్​, పశువుల వ్యర్థాలను మేతగా వేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం మానేసినప్పటికీ తిరిగి పాత పద్ధతిలోనే నడుస్తున్నారు. సంబంధిత ఆఫీసర్లకు  సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చేపల పెంపకందార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.

ఆఫీసర్లు ఏమన్నారంటే..

ఈ విషయమై ఫిషరీస్​ ఏడీ సత్యనారాయణను వివరణ కోరగా… గతంలో చికెన్​ వేస్టేజ్​, పశు వ్యర్థాలను చేపలకు మేతగా వేసినట్టు వెలుగులోకి రావడంతో విజిలెన్స్​ ఆఫీసర్లు పలువురిపై కేసులు ఫైల్​ చేశారని చెప్పారు. ఇటీవల తాము పలు చెరువులను సందర్శించి చేపల పెంపకం తీరును పరిశీలించామన్నారు. మరోసారి చెరువులను పరిశీలించి చేపలకు చికెన్​ వేస్టేజ్ మేతగా వేసిన వారిపై  చర్యలు తీసుకుంటామన్నారు.

For More News..

రజనీతో కమల్‌‌‌‌ భేటీ

తెలంగాణ టీ20 లీగ్‌ కొనసాగించరా?

తాగిన మత్తులో సూసైడ్ చేసుకున్న కార్మికులు