రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న అధికారులు, అవసరమైన సౌకర్యాలపై మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌లో పది కేజ్ కల్చర్ యూనిట్లను 2015లో ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ లో 3 వేల చేపల చొప్పున 3 లక్షల చేపలను పెంచుతున్నారు. ఈ చేపల పెంపకం కోసం అవసరమైన మేత (దాణా)ను తయారు చేసేందుకు ఫీడ్ మిషన్‌ను రూ.14.50 లక్షలతో 2016లో మంజూరు చేశారు. అప్పటి నుంచి ఫీడ్ మిషన్‌ను పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఉంచారు. ఫీడ్ మిషన్ ఏర్పాటు కోసం షెడ్డు నిర్మాణం, కరెంట్ కనెక్షన్‌ను మత్స్యకార సంఘం తరపున ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి రూ.18 లక్షల వరకు ఖర్చు కానుండగా, అంత డబ్బు సొసైటీ దగ్గర లేదంటూ సభ్యులు చెబుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా షెడ్ నిర్మించకపోవడంతో మిషన్ నిరుపయోగంగా మారింది. షెడ్ నిర్మించేందుకు అవసరమైన రెండున్నర గుంటల భూమిని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఏడాదికి రూ.3 వేలు అద్దె చెల్లించే విధంగా 30 ఏండ్ల పాటు లీజు అగ్రిమెంటు చేసుకున్నారు.
కైకలూరు నుంచి ఫీడ్..
పాలేరు రిజర్వాయర్ లో 1620 మంది మత్స్యకార సొసైటీ సభ్యులు ఉండగా, కేజ్ కల్చర్ యూనిట్లలో 150 మంది సభ్యులున్నారు. చేపల దాణాకు అవసరమైన కొబ్బరి చెక్క, తవుడు, ఇతర ముడి సామగ్రి తెచ్చుకుంటే ఫీడ్ మిషన్ ద్వారా కిలోకు రూ.30 ఖర్చుతో దాణా తయారవుతుంది. మిషన్ లేకపోవడంతో ఇప్పుడు ఏపీలోని కైకలూరు నుంచి కిలో రూ.70 చొప్పున దాణా కొనుక్కోవాల్సి వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. రోజుకు 8 క్వింటాళ్ల మేత అవసరం ఉండగా, రూ.56 వేల ఖర్చవుతోందని అంటున్నారు. ఖర్చు భరించలేక సగం దాణా మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో 6 నెలల్లో పెరగాల్సిన చేపలు, ఏడాది అయినా పెరగడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు.
షెడ్ నిర్మాణం కోసం రూ.18 లక్షలు కావాలి
ఫీడ్ మిషన్ మంజూరై ఏడేండ్లు అవుతున్నా దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేదు. కేజ్ కల్చర్ మత్స్యకారుల వాటా కింద షెడ్ నిర్మాణం, కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులు అంటున్నారు. దీనికి రూ.18 లక్షలు ఖర్చవుతుంది. ఇంత డబ్బు సొసైటీలో లేదని చెప్పాం. మత్స్యశాఖ, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి షెడ్ నిర్మాణానికి సహకరించాలి.
- ఏడుకొండలు, పాలేరు మత్స్య సహకార సంఘం కార్యదర్శి
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
పాలేరులో ఫీడ్ మిషన్ ఏర్పాటు విషయం ఇటీవల మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకారుల వాటా, ప్రభుత్వం నుంచి కొంత వాటా తీసుకొని రేకుల షెడ్ నిర్మించేందుకు ప్రయత్నిస్తా. కరెంట్ కనెక్షన్, ఇతర రా మెటీరియల్ తీసుకువచ్చి ఫీడ్ మిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేయిస్తా.
- దోమల ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి