హైదరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం శనివారం జనం బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్ గఢ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున నుంచే క్యూలైన్లలో, గ్రౌండ్బయట బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. భారీగా తరలివచ్చిన జనంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సిటీ నలుమూలల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా130 బస్సులను నడిపింది. దాదాపు 65 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 12 ఎన్జీఓలు వాటర్, టిఫిన్, భోజన సదుపాయాలు కల్పించాయి. ఆదివారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపణీ చేయనున్నట్లు బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు.
నేను, నా కొడుకు వచ్చినం
ఇక్కడి చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గుతుందని తెలుసుకుని నెల రోజుల ముందే రిజర్వేషన్చేసుకున్నాం. ఒకరోజు ముందుగా నాంపల్లికి చేరుకున్నాం. చేప ప్రసాదం తీసుకోవడం ఇదే మొదటిసారి. నేను, నా కొడుకు వచ్చాం.
- అంజలి, ఉత్తర్ ప్రదేశ్
ఈసారి ఏర్పాట్లు మంచిగున్నయ్
చేప ప్రసాదం కోసం రెండ్రోజుల ముందే నాంపల్లి గ్రౌండ్‌కు చేరుకున్నాను. శ్వాస సంబంధిత సమస్య ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుందని తెలుసుకుని వచ్చాను. నాకు కొంత కాలంగా ఆయాసంగా ఉంటోంది. అందుకే చేప ప్రసాదం తీసుకున్నాను. గతంలో ఒకసారి వచ్చాను. ఈసారి ఏర్పాట్లు కాస్త బాగున్నాయ్.
-నిఖిల్, మధ్యప్రదేశ్
ఆయాసం తగ్గుతుందని నమ్మకం
నాకు పదేండ్లు. కొద్ది నెలలుగా నడుస్తుంటే ఆయాసంగా ఉంటోంది. ఇక్కడి చేప ప్రసాదం తీసుకుంటే తగ్గుతుందని తెలిసి మా నాన్న తీసుకొచ్చాడు. ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్నాం. తెలిసిన వాళ్ల ఇంట్లో ఉండి, తెల్లవారుజామునే గ్రౌండ్‌కు చేరుకున్నాం. మొదటిసారి చేప ప్రసాదం తీసుకున్నాను.
-వెంకట ఆశ్రిత్, వైజాగ్