తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన 8 ముదిరాజ్‌ కుటుంబాలు, గుండాల మత్స్య సహకార సొసైటీ సభ్యులు కలిసి ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గతేడాది కంప చెట్లు భారీగా ఉండడంతో ఒక్కసారి మాత్రమే చేపలు పట్టి వదిలేశారు.

కొన్ని నెలల క్రితం ఈ చెరువులో మరోసారి చేప పిల్లలు పోశారు. దీంతో ప్రస్తుతం ఒక్కో చేప ఐదారు కిలోల వరకు పెరుగగా, ప్రస్తుతం రూ. 20 లక్షల విలువైన చేపలు ఉన్నాయి. ఎండాకాలంలో చేపలు పట్టేందుకు నిర్ణయించిన సొసైటీ సభ్యులు కొన్ని రోజులుగా చెరువు వద్దే కాపలా ఉంటున్నారు. ముదిరాజ్‌, సొసైటీ సభ్యులతో గ్రామస్తులకు భేదాభిప్రాయాలు రావడం, పొలిటికల్ నాయకులు ఇన్వాల్వ్ కావడంతో పంచాయితీ నడుస్తోంది. గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన యువకులు, మహిళలు, పురుషలు ఒక్కసారిగా చెరువులోకి దిగి వలలు, లుంగీలతో చేపలు పట్టారు.

గమనించిన సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుండాల ఎస్సై యాకయ్య సిబ్బందితో కలిసి చెరువు వద్దకు వచ్చి గ్రామస్తులను బయటకు వెళ్లగొట్టారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులు మరోసారి చెరువులోకి దిగారు. మళ్లీ అక్కడికి వచ్చిన పోలీసులు గ్రామస్తులను బయటకు పంపించి, ఇద్దరు కానిస్టేబుళ్లను చెరువు వద్ద కాపలా పెట్టారు. చెరువు లూటీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మత్స్య సొసైటీ ఉపాధ్యక్షుడు నల్ల యాదయ్య, డైరెక్టర్లు వాడపల్లి మధు, నర్సమ్మ తెలిపారు.