చేప పిల్లల విడుదలలో ప్రొటోకాల్ రగడ

 చేప పిల్లల విడుదలలో ప్రొటోకాల్ రగడ

నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో చేప పిల్లల విడుదల కోసం మత్స్యశాఖ అధికారులు మంగళవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డికి ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా అధికారులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఫొటో చిన్నగా ఉందని ఆమె కార్యక్రమానికి రావడానికి నిరాకరించారు. అంతకుముందు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి చెరువు వద్దకు వచ్చి గంటసేపు నిరీక్షించారు. 

ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకపోవడంతో మత్స్య శాఖ ఏడీ మల్లేశం, స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పి కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి కారు దిగి వస్తున్న క్రమంలో వెంటనే గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తర్వాత ఎమ్మెల్యే సునీతా రెడ్డి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు.ఎదుటివారి ప్రొటోకాల్ ను సైతం గౌరవించాలి ఎంతసేపు ప్రొటో కాల్ గురించి మాట్లాడే ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎదుటి వారి ప్రొటోకాల్ ను గౌరవించకపోవడం బాధాకరమని మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు. చేప పిల్లలు విడవడంలో ఆలస్యం జరిగితే అవి చనిపోయే అవకాశం ఉందని, మత్స్యకారుల మేలు కోసం అక్కడి నుంచి తిరిగి వచ్చానన్నారు. ప్రతి విషయంలో రాజకీయం చేసే ఎమ్మెల్యే ఎదుటి వారి ప్రొటోకాల్ గౌరవించడం నేర్చుకోవాలన్నారు.