- సొసైటీ ఏర్పాటుకు 50 వేలు అడిగిన జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్
- కలెక్టరేట్లో నోట్ల దండ వేసి నిరసన తెలిపిన మత్స్యకారులు
జగిత్యాల, వెలుగు : సొసైటీ ఏర్పాటుకు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ వేసి మత్స్యకారులు నిరసన తెలిపారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్ దామోదర్ సొసైటీల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మత్స్య సొసైటీల సభ్యులు ఫైర్ అయ్యారు.
మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన మత్య్సకారుల కోసం కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని దామోదర్ డిమాండ్ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. సోమవారం మత్స్యశాఖ ఆఫీసుకు వెళ్లి దామోదర్‌ను నిలదీశారు. అయితే, “నా వెనుక మినిస్టర్ ఉన్నారు. నన్ను మీరేం చేయలేరు..”అని బెదిరించారని, దీనికి సంబంధించి తమ దగ్గర ఆడియో క్లిప్ లు కూడా ఉన్నాయని మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ తెలిపారు.
అనంతరం వారు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మత్స్య శాఖ ఆఫీసర్ దామోదర్ బయటకు రాగానే ఆయన మెడలో నోట్ల దండ వేసి నిరసన తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించారు. జిల్లా మత్స్య శాఖ అధికారి దామోదర్ పై ఫిర్యాదు అందిందని, ఘటనపై ఆయన వివరణ కోరినట్టు తెలిపారు. మత్స్యకారుల ఆరోపణలపై విచారణ చేపడతామని చెప్పారు.