లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే3 వరకు లాక్డౌన్ విధించారు. దాంతో ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వెళ్దామంటే వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో స్వస్థలాలకు ఎలా వెళ్లాలో తెలియక చాలామంది అడ్డదారులు వెతుకుతున్నారు.

లాక్డౌన్ వల్ల చెన్నైలో చిక్కుకున్న ఒడిశా మత్స్యకారులు తమ రాష్ట్రానికి చేరుకోవడం కోసం పడవను ఉపయోగించి సముద్రమార్గం ద్వారా 1100 కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది, ఒడిశాకు చెందిన 25 మంది మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి లాక్డౌన్ వల్ల చెన్పైలో చిక్కుకుపోయారు. దాంతో వారు చెన్నైలో ఒక చెక్క పడవను అద్దెకు తీసుకొని ఏప్రిల్ 24న చెన్నై నుంచి బయలుదేరారు. ఏప్రిల్ 27 వారంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మార్గమధ్యలో ఏపీకి చెందిన 14 మంది మత్స్యకారులు దంకూరు వద్ద దిగారు. మిగిలిన వారు ఒడిశాకు చేరుకున్నారు. మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్న వెంటనే వారిని విడివిడిగా ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక తహశీల్దార్ హరప్రసాద్ భోయ్ తెలిపారు. వారందరికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి.. ఆహారం అందించినట్లు భోయ్ చెప్పారు. మత్స్యకారులు ప్రయాణించడానికి ఉపయోగించిన చెక్క పడవను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు వివిధ గ్రామాల్లో నిర్బంధంలో ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

లాక్డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు లేక చాలామంది సముద్ర మార్గం ద్వారా రాష్ట్రానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారని.. అందువల్ల తీరప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఒడిశా రవాణా శాఖ మంత్రి పద్మనాబ్ బెహెరా పోలీసులను ఆదేశించారు.