- మూడు సార్లు టెండర్లు పిలిచినా ఖరారు కాని టెండర్లు
మెదక్, వెలుగు: సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో చేపల పెంపకానికి డోకా ఉండదని ఆశించిన మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది. చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంలో మత్స్యకారులు అయోమయంలో ఉన్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో ప్రాజెక్టులు, చెరువులు కలిపి 1,654 సాగునీటి వనరులు ఉన్నాయి. 284 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల (సొసైటీ)లు ఉండగా వాటిల్లో 15,784 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు.
ఈ సీజన్లో ఆయా సొసైటీల ఆధ్వర్యంలో ప్రాజెక్టుల్లో, చెరువుల్లో పెంపకానికి 5.25 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయని మత్స్యశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఇండెంట్పంపారు. వివిధ కారణాల వల్ల చేప పిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ల ఖరారు ఆలస్యం కావడంతో టార్గెట్ను 50 శాతం తగ్గించి 2.62 కోట్లు సరఫరా చేయాలని నిర్ణయించారు.
మూడోసారి ఓకే అయినా..
సొసైటీలకు ఉచిత చేప విత్తన పిల్లల సరఫరా కోసం జూలై, ఆగస్టులో రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ క్రమంలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు సెప్టెంబరులో మరోసారి షార్ట్ టెండర్లు పిలిచారు. మూడో సారి నిర్వహించిన టెండర్లలో మెదక్ జిల్లాలోని సొసైటీలకు చేప విత్తన పిల్లల సరఫరా కోసం నాలుగు టెండర్లు దాఖలయ్యాయి.
కాగా సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో ఓ టెండర్ రిజెక్ట్ కాగా, మరో మూడు టెండర్లు ఖరారైనప్పటికీ మత్స్యశాఖ అధికారులు జరిపిన ఫీల్డ్ వెరిఫికేషన్లో వారికి సంబంధించిన ఫిష్ ఫాంలలో చేప పిల్లలు అందుబాటులో లేనట్టు గుర్తించారు. దీంతో వారి టెండర్లను సైతం రిజెక్ట్ చేశారు. చెరువులు పూర్తిగా నిండినప్పటికీ చేప పిల్లలు సప్లై కాక పోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురువుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
జిల్లాలోని సొసైటీలకు చేప పిల్లల సరఫరా కోసం ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు నిర్వహించాం. రెండు సార్లు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా, మూడోసారి నిర్వహించిన షార్ట్ టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినప్పటికీ నిబంధనల ప్రకారం లేకపోవడంతో వాటిని రద్దు చేశాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం.
మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి, మెదక్