జిల్లా మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి

జిల్లా మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి

సూర్యాపేట, వెలుగు : అక్రమంగా ఫిషింగ్ రైట్స్ ఇచ్చిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగుల్ నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని రాయినిగూడెం చెందిన మత్స్య కార్మికులు డిమాండ్​చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారికి వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారి లంచం తీసుకుని పిల్లలమర్రి గ్రామానికి చెందిన వారికి చేపలు పట్టుకునేలా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని పిల్లలమర్రి సొసైటీకి చేపలు పట్టుకునేలా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 

ఈ విషయమై కోర్టుకు వెళ్లగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. పిల్లలమర్రి చెరువు వివాదం మూడేండ్లుగా కొనసాగుతున్నా తమకు అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేశారని మండిపడ్డారు. చివరికి కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో శనివారం ఆదేశాలు ఇచ్చి చేపలు పట్టుకునేలా అనుమతులు ఇచ్చారని విమర్శించారు. జిల్లా మత్స్యశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వెంటనే మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్​ను కోరారు.