ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ అవకాశాల కోసం మత్స్యకారుల ఎదురుచూపులు

  • చేపల ఎగుమతులపై దృష్టి సారించని సర్కారు 
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  ఏటా 40 వేల టన్నుల చేపల ఉత్పత్తి
  • డిమాండ్  తక్కువ, ఉత్పత్తి ఎక్కువ
  • లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌పైనే అధికారుల దృష్టి
  • జిల్లా  చేపలకు నాగపూర్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ డిమాండ్

నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా ఏటా 40  వేల టన్నుల చేపలుఉత్పత్తవుతున్నా  స్థానికంగా మార్కెట్ లేక, ఎగుమతులు చేయడానికి అవకాశాలు లేక మత్య్సకారులు ఇబ్బందులు పడుతున్నారు.  జిల్లాలోని గోదావరి, ఉపనదుల పరివాహకంలో ఉన్న అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల్లోని చేపలకు స్థానికంగానే కాకుండా హైదరాబాద్,  నాగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది.  

కొద్ది రోజుల క్రితం చేపలను ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫిష్ పేరిట నోడల్ సెంటర్లను ఎంపిక చేయాలని గతంలో  ప్రతిపాదించింది.  ఈ నోడల్ సెంటర్ల ద్వారా ప్రధాన పట్టణాలు, నగరాలకు చేపలను ఎగుమతి చేయాలని భావించారు.  ఆ  ప్రతిపాదనలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.  స్థానికంగా చేపల మార్కెట్లను అభివృద్ధి చేస్తూనే ఇతర ప్రాంతాలకు ఎగుమతులుప్రోత్సహిస్తే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.  ఈ మధ్య ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తోంది.  

భారీ సంఖ్యలో రిజర్వాయర్లు

 చేప పిల్లల పెంపకానికి జిల్లా వ్యాప్తంగా గోదావరి నది, దాని ఉపనదులతో పాటు మొత్తం 14 రిజర్వాయర్లు, 1,501 చిన్న నీటి వనరులు ఉన్నాయి.  320 మత్స్య సహకార సంఘాలు ఉండగా 20  వేల కుటుంబాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.  ఏటా 10  కోట్ల చేప పిల్లలను ఈ నీటి వనరుల్లో వదులుతున్నారు.  ఇందులో మొత్తం 40  వేల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి.  చిన్న నీటి వనరుల్లో బొచ్చ, రాహు, బంగారు తీగ, రిజర్వాయర్లలో  మ్రిగాల అనే రకం చేప పిల్లల్ని పెంచుతున్నారు.  ఇతర చేపల కన్నా ఈ చేపలు ఎక్కువ రుచిగా ఉంటాయంటున్నారు.  అందువల్ల ఇక్కడి చేపలకు నాగపూర్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రధాన నగరాల్లో విపరీతమైన డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

 ఎగుమతులపై దృష్టి పెట్టాలి

స్థానికంగా ఉత్పత్తయ్యే చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.  ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టర్ చేపల ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు.  మత్య్సకారులకు ఆర్థికంగా సహకరించి వారితో ఐస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయించి ఎగుమతి జరిగేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. అనుకూలత ఉన్న చోట్ల కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసేలా పరిశీలన జరపాలని సూచించారు.