
కోంటూరు వద్ద రూ. 50 లక్షలతో ఫిష్ మార్కెట్‌కు శంకుస్థాపన
మెదక్, టౌన్, వెలుగు: రాష్ట్రంలో చెరువులపై మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం మెదక్ మండలం కోంటూరు వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి... గ్రామంలోని మత్స్యకారులకు నూతన సభ్యత్వ కార్డులను అందించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేశామన్నారు. మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి మత్స్యకారునికి అందజేయడమే లక్ష్యంగా లక్ష మంది మత్స్యకారులకు సోసైటీలలో సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక మత్స్యకారుల సౌకర్యార్ధం కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంత్రిని కోరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ జిల్లా అధికారిణి డాక్టర్ రజనీ, డీవీహెచ్‌వో వెంకట్, మెదక్ ఆర్డీవో అంబదాస్, సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ ప్రభాకర్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.