ఉప్పొంగిన దేశభక్తి ..మిడ్ మానేరులో జాతీయ జెండా ఎగరేసిన జాలర్లు

ఉప్పొంగిన దేశభక్తి ..మిడ్ మానేరులో జాతీయ జెండా ఎగరేసిన జాలర్లు

రాజన్న సిరిసిల్ల: పంద్రాగస్టు..78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశప్రజల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  సుమారు 200 సంవత్సరాల బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను సూచించే ఓ ముఖ్యమైన సందర్భం.ఊరూవాడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఎక్కడ చూసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు జనగణమన అధినాయక జయహే అంటూ పాడారు. అయితే వేముల వాడ మత్స్యకారులు కూడా తమదైన శైలిలో జాతీయ జెండా ఎగరేసి.. సంబురాలు జరుపుకున్నారు. 

మీడ్ మానేరులో మధ్యలో జాతీయ జెండా.. 

వేములవాడకు చెందిన మత్స్య కారులు మిడ్ మానేరు ప్రాజెక్టులో మధ్యలో జాతీయ జెండా ఎగరేశారు. వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లికి చెందిన ముదిరాజ్ మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్ దండు సారయ్య,  వైస్ ప్రెసిడెంట్ రేగుల పర్శురాం, కొంతమంది మత్స్యకారులు తెప్పలపై మిడ్ మానేరు ప్రాజెక్టు మధ్యకు వెళ్లారు.  తెప్పలపై కూర్చొని జాతీయ జెండా ఎగరేసి జనగణమన జాతీయ గీతం పాడారు. మత్స్యకారులు జాతీయ జెండా ఎగరేసి జనగణమన పాడి దేశం పట్ల, ప్రజల పట్ల వారికున్న గౌరవం, ప్రేమ, అభిమానాలను చాటుకున్నారు.