- వలల్లో చేపలు చిక్కడం లేదంటున్న మత్స్యకారులు
- ఉత్పత్తి తగ్గడంతో పెరిగిన రేట్లు.. కిలో రూ.200 పైనే
- మార్కెట్లో కొరతతో ఆంధ్ర నుంచి చేపల దిగుమతి
- ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు, వ్యాపారుల ఆవేదన
మంచిర్యాల, వెలుగు : ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నప్పటికీ కొద్దిరోజులుగా చలితీవ్రత బాగా పెరగడంతో వలల్లో చేపలు చిక్కడం లేదు. సాధారణంగా నీటి పైకి వచ్చి తిరిగే చేపలు చలికాలంలో అడుగుభాగానికి చేరుకుంటాయి. పైన ఉండే నీళ్లు చల్లబడడం, లోపల వెచ్చగా ఉండడం వల్ల చేపలు అక్కడక్కడే ఎక్కువగా తిరుగుతుంటాయి. మత్స్యకారులు వలలు వేసినా చేపలు పడడం లేదని పేర్కొంటున్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటతో పాటు పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతుంటారు. ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి సుమారు 450 మందికి మత్స్యశాఖ లైసెన్స్‌లు ఇచ్చింది. రోజూ సాయంత్రం తెప్పలపై గోదావరిలోకి వెళ్లి వలలు వేసి మరునాడు ఉదయం వాటిని తీస్తుంటారు. రోజూ దాదాపు 20 క్వింటాళ్ల చేపలు పడుతుండేవి. చలి తీవ్రత కారణంగా కొద్దిరోజుల నుంచి రెండు మూడు క్వింటాళ్లు కూడా పడడం లేదని మత్స్యకారులు
అంటున్నారు.
రానున్న రోజుల్లో చేపల కొరత
రాష్ర్టంలో చేపల కొరత తలెత్తే అవకాశం ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. వరదలకు ప్రాజెక్టుల్లోని చేపలన్నీ వెళ్లిపోయాయి. ఈసారి ఒక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే నీళ్లున్నాయి. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లు మొన్నటిదాకా తెరిచి ఉండడంతో అందులో నీళ్లు లేవు. దీంతో ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రమే సీడ్పోశారు. నిరుడు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో 2.20 కోట్ల చేప పిల్లలు వదలగా, ఈసారి కోటి టార్గెట్‌గా పెట్టుకొని కేవలం 29 లక్షలు పోశారు. అది కూడా ఆలస్యంగా నవంబర్‌లో పోయడం, వెంటనే చలి తీవ్రత పెరగడం వల్ల చేపల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని మత్స్యకారులు అంటున్నారు.
ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు, వ్యాపారులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికే వచ్చి హోల్‌సేల్‌గా కిలో రూ.100 నుంచి రూ.120కి మత్స్యకారుల వద్ద కొని రిటైల్‌గా అమ్ముకునేవారు. కొద్దిరోజుల నుంచి చేపలు పడకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో చేపల రేటు పెరిగింది. బొచ్చె, రవ్వ, బంగారు తీగ, ఫంగాషియస్ వంటి చేపలను రిటైల్‌లో కిలో రూ.200 పైనే అమ్ముతున్నారు. బొమ్మెల రేటు రూ.500 పైనే పలుకుతోంది.
ALSO READ : గ్రీన్ ఫీల్డ్ రోడ్ల భూసేకరణకు కసరత్తు.. ఫోర్త్ సిటీ మీదుగా వేసేందుకు ప్లాన్
రెండు మూడు కిలోలు సుత పడ్తలేవ్
గుడిపేటలో 200 కుటుంబాలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపలు పట్టి బతుకుతున్నం. గతంలో రోజూ 5 నుంచి 10 కిలోల చేపలు పడేవి. నెలరోజుల నుంచి రెండు మూడు కిలోలు సుత పడ్తలేవ్. మత్స్యకారులకు పూటగడవం కష్టంగా ఉంది. ఈసారి గోదావరికి భారీ వరదలు రావడం వల్ల ప్రాజెక్టుల్లోని చేపలన్నీ కొట్టుకపోయినయ్. సీడ్కూడా తక్కువ వేసిన్రు.
లోకె శ్రీనివాస్, మత్స్యకారుడు, గుడిపేట
ఆంధ్ర నుంచి వస్తున్నయ్
చాలా ఏండ్ల నుంచి చేపల వ్యాపారం చేస్తున్న. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మత్స్యకారుల నుంచి హోల్‌సేల్‌గా కొనుక్కపోయి రిటైల్‌గా అమ్ముతా. రోజూ 10 నుంచి 15 కిలోలు తీసుకెళ్లేది. ఇప్పుడు రెండు మూడు కిలోలు కూడా దొర్కుతలేవు. మార్కెట్లో చేపల కొరత వల్ల ఆంధ్ర నుంచి వస్తున్నయ్. రేట్లు పెరగడంతో పెట్రోల్ఖర్చులు సుత ఎల్తలేవ్.
రవీంద్రబాబు, చేపల వ్యాపారి, రామకృష్ణాపూర్ బీజోన్