ఫిట్​నెస్​.. లీడర్​కు బోనస్​

రాజకీయ నాయకులంటే ఎప్పుడూ జనం మధ్యలోనే ఉండాలి. ఊరూరూ తిరుగుతూనే ఉండాలి. అలా తిరగాలన్నా… సమాజాన్ని తనతో పాటు నడిపించాలన్నా ఫిజికల్​ ఫిట్​నెస్​ ఉండాలి. షేప్​లెస్​ బాడీతో చురుకుదనం రాదు. ప్రపంచంలో టాప్​ పొజిషన్​కి వెళ్లిన చాలామందిలో కనిపించే కామన్​ పాయింట్​ అలుపులేకుండా పనిచేయగల కెపాసిటీనే. ఇది మందులతో వచ్చేది కాదు, క్రమం తప్పకుండా ఎక్సర్​సైజ్​ చేయడంద్వారానే సాధ్యపడుతుంది. 70 ఏళ్లకు దగ్గరవుతున్నా నరేంద్ర మోడీ, వ్లాదిమిర్​ పుతిన్​ లాంటివాళ్లు

బిరబిరా నడుస్తూ..చకచకా ఆలోచిస్తున్నారంటే…కారణం వాళ్ల ఫిజికల్​ ఫిట్​నెస్​!

స్వామి వివేకానంద చనిపోయి 117 ఏళ్లు. ఇప్పటికీ కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు ఏ స్కూలులో డ్రెస్​ కాంపిటీషన్​ జరిగినా వివేకానంద వేషధారణ కంపల్సరీగా కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే… వివేకానందలా డ్రెస్​ వేసుకున్నవాళ్లకే ‘ది బెస్ట్​ అవార్డు’కూడా రావడం! ఫిజికల్​ ఫిట్​నెస్​కి వివేకానందుడు గొప్ప మోడల్​. ‘ఉక్కు కండరాలు కలిగిన యువకులు కావాలి’ అన్నారాయన. ‘నీకు ఫిట్​నెస్​ కావాలంటే  ఫుట్​బాల్​ మ్యాచ్​ ఆడు’ అని చెప్పిన దార్శనికుడు. ఫిట్​నెస్​ ఇండియా అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వివరించినప్పుడు ఈ మాటలే గుర్తొచ్చాయి. ఆరెస్సెస్​ స్వయం సేవక్​గా ఉన్న రోజుల నుంచీ ఆయన రోజూ యోగ, ధ్యానం, వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారు. ఇప్పటికీ తెల్లవారుజామునే లేచి మార్నింగ్​ వాక్​కి వెళ్తుంటారు.  మహాబలిపురం సముద్రపు ఒడ్డున ఆయన వాకింగ్​ చేయడం అందరూ చూసే ఉంటారు. ఇది ఏ ఒక్క నరేంద్ర మోడీకో పరిమితమైంది కాదు. ప్రపంచాధినేతలందరూ తమ డైలీ లైఫ్​ని ఇలాగే ఆరంభిస్తుంటారు. మితంగా తినడం, అమితంగా ఆలోచించడం అనేవి లీడర్​షిప్​ క్వాలిటీస్​లో ముఖ్యమైనవి. ఆధునిక సమాజంలో ‘ఫిట్​ టు లీడ్​’ అనేది వేద మంత్రంలా వ్యాపించింది.

ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తనను తాను లీడర్​లా మలచుకోగలడు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని నడిపించగలడు అని మేనేజ్​మెంట్​ స్కూళ్లలోనూ చెబుతున్నారు. వీటిలో బయటకు కనిపించేది ఫిజికల్​ ఫిట్​నెస్​.  ఒక వ్యాపారాన్ని నిర్వహించేవారికంటే ప్రభుత్వాన్ని నడిపించేవారికి ఓర్పు, నేర్పు, చొరవ, ఆత్మ విశ్వాసం, నిర్ణయాలు వెంటవెంటనే తీసుకునే చొరవ, చురుకు, నలుగురిలో కలిసిపోగల మెళకువ, సమయస్ఫూర్తి, చాకచక్యం చాలా ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ సాధ్యపడాలంటే ఫిజికల్​ ఫిట్​నెస్​ తప్పనిసరి. ‘బుర్ర చకచకా పనిచేయాలంటే ఒళ్లు స్వాధీనంలో ఉండాల’ని జపాన్​వాళ్ల నమ్మకం. క్రమశిక్షణ, లక్ష్యసాధనల విషయంలో జపనీయులు ప్రపంచంలోనే ముందుంటారు.

ఫిజికల్​ ఫిట్​నెస్​ అనేది ప్రజా జీవితంలో బిజీగా గడిపేవాళ్లకు లేనట్లయితే, తరచు అనారోగ్యం పాలవడం ఖాయం. వాళ్లు తెల్లారి లేచింది మొదలు బాగా పొద్దుపోయేవరకు జనంలోనే ఉంటారు. రకరకాల మనుషుల మధ్య, వాతావరణం మధ్య పొలిటీషియన్లు పనిచేస్తుంటారు. ఈ క్షణాన మంచుతో నిండిన హిమాచల్​ ప్రదేశ్​లో పర్యటిస్తే.. మర్నాడు చెమటతో ముద్దయ్యే రాజస్థాన్​లో తిరగాల్సి వస్తుంది. అభిమానించేవాళ్లతోపాటు, విమర్శలతో నీరుగార్చేసేవాళ్లనుకూడా తట్టుకోవాలి. అందుకే బాడీ ఫిట్​గా ఉంటే, మైండ్​కూడా చురుగ్గా ఉంటుందని చెబుతారు.

69.. అయినా సూపర్​ ఫిట్​

నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడే నలుగురికీ చెప్పగలవు అన్నారు రామకృష్ణ పరమహంస. ‘ఫిట్​నెస్​ ఇండియా మూవ్​మెంట్​’ని ప్రకటించడానికి ప్రధాని నరేంద్ర మోడీని మించిన ఫిజిక్​ మోడల్​ ఎవరుంటారు? నేషనల్​ స్పోర్ట్స్​ డే నాడు మోడీ ఈ ఉద్యమాన్ని ‘బాడీ ఫిట్​ తో మైండ్​ హిట్​’ అన్న  స్లోగన్​తో ఆరంభించారు. సొంత విషయాల్లో పరమ బద్దకస్తులైన మన ఇండియన్లకు ఉద్యమ స్ఫూర్తితో ‘ఫిట్​నెస్​ ఫీవర్​’ రావాలి.  మోడీ ఇదే మాట చెప్పారు. ‘గతంలో 60 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలొచ్చేవి. ఇప్పుడు 30, 40 ఏళ్లకే గుండెపోట్లు వస్తున్నాయి. లైఫ్​ స్టయిల్​లో మార్పులవల్ల పరిస్థితి ఇలా తయారైంది’ అన్నారు.  మోడీ స్వయంగా యోగా ఎక్స్​పర్ట్. ఉదయాన్నే లేచి వర్కవుట్లు చేస్తారు. ఇండియన్లకే సొంతమైన యోగాసనాల్ని ఇప్పుడు సౌదీ అరేబియా వంటి దేశాల్లోకూడా జనం పాటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. ఏటా జూన్​ 21న ‘అంతర్జాతీయ యోగా డే’ జరుపుతోంది.  ఈ మధ్యనే 69 ఏళ్లకు వచ్చిన మోడీలో అలసట, అనారోగ్యం అనేవి మచ్చుకైనా కనిపించవు. చిన్నతనం నుంచీ తన సొంతూరు వాడ్నగర్​లోని శర్మిష్ట సరస్సులో ఈత కొట్టేవారు.

ఈత కొట్టడంవల్ల శరీరంలోని అన్ని అవయవాలకు సమానంగా ఎక్సర్​సైజ్​ లభిస్తుంది. ఇక, అరెస్సెస్​ స్వయం సేవక్​గా ఉన్న రోజుల నుంచీ సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు వేయడం మోడీకి అలవాటయ్యింది. 1992–93 ప్రాంతాల్లో బీజేపీని జనంలోకి తీసుకెళ్లడానికి గుజరాత్​ మొత్తాన్ని చుట్టేయడంతో ఆయనకు వెన్నుపోటు, నడుం నొప్పి వచ్చాయి. బెంగళూరులోని వివేకానంద యోగ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​లో చేరి, మళ్లీ మామూలు మనిషి కాగలిగారు. అప్పటినుంచీ ఆయన యోగాకి బ్రాండ్​ అంబాసిడర్​గా మారిపోయారు. సీఎం అయ్యాక గుజరాత్​లో యోగా యూనివర్సిటీకూడా ఏర్పాటు చేయించారు.

యోగా, ప్రాణాయామంతోపాటు మోడీ ఆహారపు అలవాట్లుకూడా హెల్దీగానే ఉంటాయి. చిన్నప్పట్నుంచీ ఉదయానే సజ్జలతో చేసిన చపాతీ తిని, టీ తాగేవారు. మధ్యాహ్నం  పచ్చి సెనగలు, సెనగపిండి, కొన్ని పప్పులుతో చేసిన కఢీ కూర, బియ్యం పప్పులు కలిపి ఉడికించిన కిచిడీ తినేవారు. ఆ రోజుల్లో గోధుమ చపాతీలు, కాయగూరలతో చేసిన కూరలు చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. చిన్నతనంలో బీదరికంవల్ల అలవాటైన ఆహారం తనకు ఎంతో మేలు చేసిందంటారు మోడీ. అయితే, ఛాయ్​ తాగడం మాత్రం మానలేదు. మోడీకి ధాబా స్టయిల్​లో తయారుచేసిన ఛాయ్​ అంటే ప్రాణం. అఫీషియల్​గా ఆయనకు గ్రీన్​ ఛాయ్​ ఇస్తుంటారు. ఒకసారి ఏదో మీటింగ్​కి వెళ్లినప్పుడు ‘నాకు రోడ్డు పక్కన ధాబాల్లో అమ్మే ఛాయ్​ ఇవ్వండయ్యా, గ్రీన్​ టీతో మొహం మొత్తింది’ అన్నారు. మోడీకి ఎర్రపప్పుతో చేసే గుజరాతీ వంటకం ఖాఖ్రా, చపాతీలు, కూరగాయలు తినడమంటేకూడా ఇష్టం. తనకు అటుకులతో పోహ (ఉప్మా) చేయడం బాగా వచ్చని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.  రోజూ నాలుగు గంటలకు మించి మోడీ నిద్రపోరు. టంచన్​గా అయిదింటికల్లా లేచిపోయి, యోగాసనాలు వేస్తారు.

ఎందుకు

అవసరమంటే…

నాయకుడి చుట్టూ ఉండే అనుచరగణం చాలా క్యాజువల్​గా తమ లీడర్​ని ఇమిటేట్​ చేస్తుంటారు. ఆయన బాటనే ఫాలో అవుతుంటారు. అటువంటప్పుడు లీడర్​లో క్రమశిక్షణ లేకపోయినా, టైమ్​ని పాటించకపోయినా ఫాలోవర్స్​లో సీరియస్​నెస్​ ఉండదు. లీడర్​ గనుక కంట్రోల్​ లేకుండా తినడం, తాగడం చేస్తూ షేప్​లెస్​గా తయారైతే, అనుచరులుకూడా అలాగే తయారవుతారు.

మానసికంగా చురుకుదనం ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. రకరకాల ఒత్తిళ్ల నుంచి బయటపడేసి ఉత్తేజంగా ఉంచగల శక్తి వ్యాయామానికే ఉంది. మెదడులో నాడీమండలాన్ని యాక్టివేట్​ చేసి, చురుకైన ఆలోచనలు పుట్టేలా తయారుచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంటే మనిషికి అలసటనేదే తెలియదు.

నాయకులు ఎప్పుడూ ఒకడుగు ముందుకేసి ఆలోచించగలవాళ్లయి ఉండాలి. వేలల్లో ఒకరుగా కాకుండా ‘వేలల్లో అతనొక్కడే’గా ఎదగాలంటే వాళ్ల ఆలోచనా విధానంకూడా మంచి పదును తేలాలి. పబ్లిక్​ అవసరాలను గుర్తించి, వాళ్లకోసం స్కీముల్ని రూపొందించడానికి శరీరం సహకరిస్తుండాలి. ఎప్పడూ నీరసంగా, అనారోగ్యంగా ఉండేవాళ్లలో క్రియేటివిటీ పాళ్లు తక్కువని సైంటిఫిక్​గా రుజువైంది.

కారు మాదిరిగానే శరీరంకూడా అలుపుసొలుపు లేకుండా పనిచేయగలగాలి. ప్యూర్​ పెట్రోల్​ నింపుకున్న కారు పరుగులు దీసినట్లే… సరైన ఆహారపు అలవాట్లతో లీడర్​కూడా చకచకా తిరగాలి. ఎలాంటి అనారోగ్యం సోకకుండా సుదూరాలు ప్రయాణించగలగాలి. కూర్చుంటే నడుం నొప్పి, తిరిగితే కాళ్ల పీకుడు అన్నట్లుగా ఉంటే ప్రజలకు న్యాయం చేయలేరు.  లీడర్​ హుషారుగా ఉంటేనే జనాలు కూడా కలవడానికి ఇష్టపడతారు.

తల్లయిన 6 వారాలకే ఆఫీసు​కు హాజరు

‘ఏంది? నేనేమైనా మొట్టమొదటి బాలింతనా!’ అన్నారు న్యూజీలాండ్​ ప్రైమ్​ మినిస్టర్​ జెసిండా అర్డర్న్​. ఆమె 2017లో ప్రధాని అయ్యాక తాను గర్భవతినని ప్రకటించారు. ఆరు వారాలే లీవ్​ తీసుకున్నారు. 39 ఏళ్ల జెసిండాకి ఈ మధ్యనే కూతురు పుట్టింది. పాప పుట్టాక రకరకాల ఎక్స్​ర్​సైజులు చేసి ఊహించనంత త్వరగా మళ్లీ ఫిట్​ అయ్యారు జెసిండా. పీఎం అయినా గానీ  పిల్లల పెంపకంలో  మాత్రం చాలా బాధ్యతగా ఉంటారు. అసలు, భార్యాభర్తలిద్దరూ పిల్లల పెంపకంలో సమాన బాధ్యతలు తీసుకోవాలని జెసిండా న్యూజీలాండ్​ రేడియోలో చెప్పుకొచ్చారు.  కూతురి పెంపకంలో, ఆలనాపాలనా చూడడంలో తన భర్త సహకరిస్తున్నారని తెలిపారు. పదవిలో ఉండగా పిల్లల్ని కన్న రెండో నాయకురాలిగా ఆమె రికార్డులకెక్కారు. గతంలో బేనజీర్​ భుట్టో పదవిలో ఉన్నప్పుడు (1990లో) ఆమెకు రెండో బిడ్డ పుట్టింది.

ట్రంప్​ రూటు సెపరేటు​

డొనాల్డ్​ ట్రంప్​ వ్యవహార శైలిలాగే, ఆయన లైఫ్​ స్టయిల్​కూడా చాలా డిఫరెంట్​గా ఉంటుంది. ఇప్పటివరకు ప్రెసిడెంట్లయినవాళ్లు ఫిజిక్​ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఈ విషయంలో ట్రంప్​ రూటు సెపరేట్​. ఛాన్స్ దొరికితే చాలు, ఫాస్ట్​ ఫుడ్​ తినాలనుకుంటారు. పొద్దున్నే లేవడం, గంటల కొద్దీ ఎక్సర్​సైజ్​ చేయడం ఆయనకు అస్సలు గిట్టవు. ‘కడుపు నిండా తినడమంటే ట్రంప్​కి ఎక్కువ ఇంటరెస్ట్​. క్యాలరీలు కరిగించుకోవడానికి ఇష్టపడరు. ప్రస్తుతం ట్రంప్​ బరువు 109 కిలోలు. ఆయన కనీసం ఆరు కేజీలైనా తగ్గాలి’ అన్నారు వైట్​హౌస్​ ఫిజీషియన్​ రానీ జాక్సన్.  ఆ మాటంటే ట్రంప్​ కొట్టిపారేస్తారు. పైగా, ఎక్సర్​సైజ్​ ఎక్కువగా చేస్తే మోచిప్పలు అరిగిపోతాయని, హిప్​ బోన్స్​ మార్చాల్సి వస్తుందని కొత్త థియరీ చెబుతుంటారు. ‘నా ఫ్రెండ్సందరూ ఎక్సర్​సైజ్​లు చేసి చేసి చివరకు మోచిప్పలు మార్చుకున్నారు. నేను జనం ముందు గంటల తరబడి నిలబడుతుంటాను. అదే నా ఎక్సర్​సైజ్​’ అని ట్రంప్​ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాలేజీ రోజుల్లో మంచి అథ్లెట్​గా ఉండేవారు ట్రంప్​. ఆ తర్వాత ఆటలాడడం టైమ్​ వేస్టుగా భావించడం మొదలెట్టారు. చివరకు గోల్ఫ్​ ఆడాలన్నా చిరాకే. దానిలో ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది. ఎప్పుడైనా వైట్​హౌస్​ ఫిజీషియన్​ పట్టుబడితే… బంతి కొట్టాక దాని దగ్గరకు బ్యాటరీ కారులో వెళ్తారు తప్ప నడవరు. ట్రంప్​ దృష్టిలో శరీరం ఒక బ్యాటరీ లాంటిది. అది తయారవడమే కొంత ఎనర్జీతో తయారై రిలీజ్​ అవుతుంది. ఎక్సర్​సైజ్​ల పేరుతో దాని లైఫ్​ని తగ్గించేయకూడదన్నది ఆయన ఉద్దేశం. ‘కడుపు నిండా తిను. కంటి నిండా నిద్రపో’… ఇదీ ట్రంప్​ స్లోగన్​.

రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ సిక్స్​ ప్యాక్​

రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ ఎంత ఫిట్​గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ కాస్త తీరిక దొరికినా  సైబీరియన్​ టైవా రీజియన్​లో వేటాడుతూ, అక్కడి మంచు సరస్సుల్లో ఈత కొడుతూ,  ఐస్​ హాకీ ఆడుతూ కాలం గడుపుతారు. 23 ఏళ్ల వయస్సులో ఆయన రష్యా గూఢచారి సంస్థ కేజీబీలో చేరారు. కోల్డ్​వార్​ రోజుల్లో అమెరికన్ల సీఐఏకి పోటీగా కేజీబీ పనిచేసేది. ఇంటెలిజెన్స్​ సర్వీసులో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రష్యా సెక్యూరిటీ సర్వీసెస్​ డైరెక్టర్​ కాగలిగారు. సర్వీసు నుంచి నేరుగా పాలిటిక్స్​లో ప్రవేశించి, గడచిన 20 ఏళ్లుగా రష్యాని నడిపిస్తున్నారు. పుతిన్​కి ఇప్పుడు 67 ఏళ్లు.  సిక్స్​ ప్యాక్​ బాడీతో చాలా స్టయిల్​గా కనిపిస్తుంటారు. ఆయన ఎంత ఒత్తడిలో ఉన్నాగానీ, కాసేపు తన పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మానరు. ఆయన దగ్గర కెనడాకి చెందిన బ్లాక్​ లాబ్రడార్, జపాన్​కి చెందిన అకిత ఇను, బల్గేరియన్ల కరకచన్​ జాతి కుక్కలున్నాయి. వీకెండ్స్​ వస్తే తన బాడీగార్డులతో కలిసి ఐస్​ హాకీ ఆడతారు. రష్యన్లు వోడ్కా తాగడాన్ని ప్రెస్టీజ్​గా భావిస్తారు. పుతిన్​ అధికార కార్యక్రమాల్లో తప్ప, మామూలుగా మద్యం జోలికి వెళ్లరు. పిస్తాచియో ఐస్​ క్రీమ్​ అంటే ప్రాణం. ఒకసారి జీ20 మీటింగ్​కి వచ్చిన చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​కి​ ఏకంగా పిస్తాచియో ఐస్​క్రీమ్​ నింపిన టబ్​ని ప్రెజెంట్​ చేశారు. పుతిన్​ రాత్రిళ్లు ఎక్కువసేపు పనిచేస్తుంటారు. ఉదయాన ఆలస్యంగా లేవడం ఆయన అలవాటు. సాధారణంగా లంచ్​ టైమ్​లో ఆయన బ్రేక్​ఫాస్ట్​ చేస్తుంటారు. క్వాయిల్​ పిట్టల గుడ్లతో చేసిన పెద్ద ఆమ్లెట్​గానీ, పాలు, క్రీమ్, కోడిగుడ్లతో చేసే పోరిడ్జ్​గానీ తింటారు. ఆయన ఏం తినాలన్నా ముందుగా ప్రెసిడెంట్​ ప్యాలెస్​లో ఫుడ్​ ఎక్స్​పర్ట్​లు టేస్ట్​ చేసి ఓకే చేయాల్సిందే!

వాకింగే మమత సీక్రెట్​

దేశంలో ఫైర్​ బ్రాండ్​ లీడర్​ ఎవరంటే టక్కున మమతా బెనర్జీ గుర్తొస్తారు. కానీ, ఆమెకు నూనె, మసాలు దట్టించిన ఆహారం అంటే అస్సలు పడదు.  కూరగాయలతో ఉడికించిన అన్నం, ఎర్రగా వేయించిన ఆలు గడ్డ వేపుడు ఇష్టంగా తింటారు. ఉదయానే లేచాక 5, 6 కిలోమీటర్ల దూరం ట్రెడ్​మిల్​పై నడుస్తారు.సాధ్యమైనంతవరకు చాలా చోట్లకు నడిచి వెళ్లడానికే మమత మొగ్గుచూపుతారు.  మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రకృతిని ప్రేమించడం, మంచి మంచి పుస్తకాలు చదవడం, వీలున్నప్పుడల్లా బొమ్మలు వేయడం, కవితలు రాయడం తన ఆరోగ్య రహస్యాలుగా మమతా బెనర్జీ చెప్తారు. పశ్చిమ బెంగాల్​ సీఎంగా సెకండ్​ టర్మ్​ కొనసాగిస్తున్న మమత.. ఏమాత్రం అవకాశమున్నా హిమాలయ ప్రాంతాలకు, మోదినీపూర్​ అడవులకు వెళ్లి గడుపుతారు.

వణికిన మెర్కెల్​..

ఇప్పుడు హుషార్​ఆమె అప్పటికి మూడుసార్లు వణుకుడు వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఆయినాగానీ, క్రమం తప్పకుండా వర్కవుట్స్​ చేసి కోలుకున్నారు. పారిస్​లో జరిగిన బ్యాసిల్​ డే వేడుకల్లో పాల్గొని దాదాపు కిలోమీటర్​ దూరం అందరితో కలిసి నడిచారు. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​ 65 ఏళ్ల వయసులో సైతం అనారోగ్యాన్ని దాటుకుని చలాకీగా పనిచేయడం వేడుకల్లో పాల్గొన్నవాళ్లను ఆశ్చర్యపరిచింది. ఫ్రాన్స్​ నేషనల్​ హాలీడే సందర్భంగా రెండు గంటలపాటు జరిగిన మిలిటరీ పరేడ్​కికూడా మెర్కెల్​ హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చింది. ఎలాంటి అలసట కనబడకుండా చురుకుగా గడిపారు. అక్కడి నుంచి జర్మన్​ రాయబార కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. మీడియా ముందు నిలబడి ఉపన్యసించారు. తనను మిలిటరీ పరేడ్​కి చీఫ్​ గెస్ట్​గా ఆహ్వానించినందుకు ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ ఎమ్మాన్యుయేల్​ మేక్రాన్​కి థ్యాంక్స్​ చెప్పారు.

ఇదెవరో తెలుసా..86 ఏళ్ల దేవెగౌడ

మాజీ ప్రధాని దేవెగౌడ వయసు 86 ఏళ్లు. ఫిట్​నెస్​ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరు. ఇప్పటికీ రోజువారీ ఆయన యోగాసనాలు వేస్తుంటారు. స్వతహాగా దైవ భక్తుడైన దేవెగౌడ ఎంతసేపయినా పూజల్లో కదలకుండా కూర్చోవడం, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటివి చేస్తుంటారు. నిన్న మొన్నటి వరకు ఎవరి సాయం తీసుకోకుండా గుడి గోపురాలను సందర్శించేవారు. ఉదయాన్నే ఫిజియోథెరపీ చేయించుకుంటూ శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటారు. 90 ఏళ్లకు చేరువవుతున్నప్పటికీ యాక్టివ్​గా ఉండడం దేవెగౌడ స్పెషాలిటీ.