హిట్‌మ్యాన్ వస్తాడా?
పాసైతే వెంటనే ఆసీస్‌కు పయనం
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడా? అతను ఆసీస్ ఫ్లైట్ ఎక్కుతాడా? ఈ ప్రశ్నలకు మరి కొన్ని గంటల్లోనే సమాధానం లభించనుంది. గాయం నుంచి కోలుకున్న హిట్‌మ్యాన్ శుక్రవారం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. ఈ టెస్టులో పాస్ అయితే తొందర్లోనే అతను ఆసీస్ బయల్దేరనున్నాడు. వీలైతే శనివారమే అతడిని ఫ్లైట్ ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. అయితే, రోహిత్ ఆసీస్ చేరుకున్నా కరోనా వైరస్ ప్రొటోకాల్ నేపథ్యంలో అతను వెంటనే ఇండియా టీమ్‌తో జాయిన్ అయ్యే చాన్స్ లేదు. ముందుగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఈ నెలాఖరుకు క్వారంటైన్ ముగిస్తే తర్వాత నెట్ సెషన్స్‌లో ఆడి టెస్టు మోడ్‌లోకి రానున్నాడు. ఈనెల 17న అడిలైడ్‌లో తొలి టెస్టు మొదలవనుండగా 26 నుంచి మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు జరుగుతుంది. మూడో టెస్టు సిడ్నీలో జనవరి 7న షురూ అవుతుంది. అయితే, అప్పటిలోగా రోహిత్ మ్యాచ్ ఫిట్‌నెస్ అందుకుంటాడా? లేడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఐపీఎల్‌లో గాయపడ్డ కారణంగా రోహిత్‌ను ఈ టూర్‌లో మూడు ఫార్మాట్ల జట్లకూ దూరంగా ఉంచారు. కానీ, ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఆడడంతో పాటు ముంబైకి ఐదో టైటిల్ అందించడంతో అతడిని టీమ్‌లోకి తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. దాంతో, చివరి రెండు టెస్టులకు రోహిత్‌ను ఎంపిక చేశారు. అయితే, టీమ్‌తో కలిసి ఆసీస్ వెళ్లని హిట్‌మ్యాన్ ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవుతుండడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. రోహిత్ ఫిట్‌నెస్‌ను క్లియర్ చేసుకొని ఆసీస్ విమానం ఎక్కాలని అభిమానులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా కోరుకుంటోంది. ఎందుకంటే కోహ్లీ ఫస్ట్ టెస్టు అనంతరం ఇండియా తిరిగొస్తున్నాడు. కాబట్టి రోహిత్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ ఉండడం టీమ్‌కు కీలకం కానుంది.
For More News..