- హైదరాబాద్‌లో ఒకే రోజు..ఐదు యాక్సిడెంట్లు.. ఏడుగురు మృతి
- వాకర్స్ పైకి బైక్ దూసుకెళ్లడంతో బొల్లారంలో ఇద్దరు..
- శామీర్‌పేట, ఈసీఐఎల్‌లో జరిగిన బైక్ ప్రమాదాల్లో నలుగురు..
- రాజేంద్రనగర్‌లో కారు ఢీకొని ఒకరు మృత్యువాత
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఆదివారం ఒకేరోజు ఐదు యాక్సిడెంట్లు జరగ్గా, ఏడుగురు దుర్మరణం చెందారు. బొల్లారంలో మార్నింగ్ వాకర్స్ పైకి స్పోర్ట్స్ బైక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బొల్లారానికి చెందిన రాధిక (48), బాలమ్మ(58) స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన ఐటీ ఉద్యోగి ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ లోని ఆరాంఘర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టి, మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకర్ రవికాంత్(35) స్పాట్‌లోనే చనిపోయాడు. అతను ఉస్మానియా హాస్పిటల్ లో ఎలక్ట్రిషియన్ గా పని చేస్తున్నాడు.
కరెంట్ పోల్ ను ఢీకొట్టి..
శామీర్ పేటలో కరెంట్ పోల్ ను బైక్ ఢీకొట్టగా, ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాబాగూడ గ్రామంలో హైస్పీడ్‌తో వచ్చిన బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. బైక్ పై ముగ్గురు ఉండగా, ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. వీరిని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన కృష్ణ (20), మహేష్(22)గా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
విగ్రహం దిమ్మెను ఢీకొట్టి..
బైక్‌తో విగ్రహం దిమ్మెను ఢీకొట్టి ఇద్దరు యువ కులు చనిపోయారు. ఈ ఘటన కుషాయిగూడలోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన తునికి క్రాంతి(23) కుటుంబ సభ్యులతో కలిసి మౌలాలీలోని నవోదయ నగర్ కాలనీలో ఉంటున్నాడు. కొంపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతున్నాడు. జనగామకు చెందిన ఉల్లెంగుల నరేశ్(23) డిగ్రీ పూర్తి చేసి, నగరంలోని ఓ ఎలక్ర్టానిక్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇతడు రామంతాపూర్ లో ఉంటున్నాడు. క్రాంతి, నరేష్ బంధువులు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ బైక్ పై టీ తాగడానికి ఈసీఐఎల్‌కు బయలుదేరారు. తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఈసీఐఎల్ చౌరస్తాలో బైక్ అదుపుతప్పి, ఎదురుగా ఉన్న అంబేద్కర్విగ్రహ దిమ్మెను ఢీకొట్టింది. బైక్ పైనుంచి ఎగిరిపడ్డ ఇద్దరు.. తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయారు.
హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు..
ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. రేయిలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. బాచుపల్లికి చెందిన కరీముల్లా (26) ఐమాక్స్ చౌరస్తా నుంచి తిరుమలగిరి వైపు వేగంగా వెళ్తుండగా.. ఎన్టీఆర్ గార్డెన్ రోడ్డు మలుపు వద్ద కారు కంట్రోల్ కాలేదు. దీంతో కారు మరింత వేగంతో దూసుకెళ్లి హుస్సేన్ సాగర్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కరీముల్లా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు వచ్చి కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.