మహబూబాబాద్ మహిళ మర్డర్ కేసులో ఐదుగురు అరెస్ట్

మహబూబాబాద్ మహిళ మర్డర్ కేసులో ఐదుగురు అరెస్ట్

మహబూబాబాద్, వెలుగు:  భార్యను హత్య చేసి ఇంటి ముందు పాతి పెట్టిన కేసులో భర్తతో పాటు నలుగురు కుటుంబసభ్యులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్​కేకన్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామానికి చెందిన కాటి రాములు, లక్ష్మి దంపతులకు కూతురు దుర్గ, కొడుకు గోపీ ఉన్నారు. 

వీరి కుటుంబం  బతుకు దెరువు కోసం12 ఏండ్ల కింద మహబూబాబాద్ కు వచ్చి సిగ్నల్ కాలనీలో ఉంటుంది. నాలుగేండ్ల కింద గోపీ సుతారి పని కోసం ఏపీలోని ఏలూరు వెళ్లాడు. అక్కడ పరిచయమైన నాగమణి అనే మహిళను పెండ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. నాగమణిని గోపీ పెండ్లి చేసుకోవడం కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. 

దీంతో  గత నెల16న గోపీతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరి దుర్గ, మహేందర్ దంపతులు కలిసి నాగమణిని ఇంట్లో కొట్టి చంపారు. అనంతరం ఇంటి ముందు బొంద తీసి డెడ్ బాడీని పాతిపెట్టారు. కొద్ది రోజులుగా నాగమణి కనిపించకపోతుండగా కాలనీవాసులు అడుగుతుండగా సంక్రాంతి రోజు ఇల్లు విడిచిపెట్టి పారిపోయిందని చెప్పారు. కొందరు స్థానికులు అనుమానిస్తూ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. 

ఎంక్వైరీ చేయగా కుటుంబసభ్యులే ఆమెను చంపినట్టు తేలింది.  ఐదుగురు కుటుంబసభ్యులను శుక్రవారం అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన గోపీ మేనమాన బత్తుల వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్టు చెప్పారు.