- కరీంనగర్లో కుక్కల నియంత్రణ చర్యలు శూన్యం
- బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల జన్యునిటీపై అనుమానాలు
- నిరుడు కరీంనగర్ సిటీలో 913 కుక్కలకు ఆపరేషన్లు
కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నయి. నిత్యం అనేక చోట్ల ప్రజలపై దాడులకు తెగబడుతున్నయి. రోజుకు సగటున 20 మందికిపైగా కుక్కకాట్ల బారిన పడుతున్నరు. నెలలో ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య వందల్లో ఉంటోంది. గడిచిన ఏడు నెలల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా సుమారు ఐదున్నర వేల మంది కుక్కల దాడిలో గాయపడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలతోపాటు చాలా గ్రామాల్లో కుక్కల నియంత్రణను అధికార యంత్రాగం పట్టించుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 600 మంది నుంచి 750 మంది వరకు కుక్క కాటు బాధితులు పీహెచ్ సీలు, సీహెచ్ సీలు, సివిల్ హాస్పిటల్స్ లో యాంటీ రేబిస్ ఇంజక్షన్ వేయించుకుంటున్నరు. జనవరిలో 750 మంది, ఫిబ్రవరిలో 851 మంది, మార్చిలో 789 మంది, ఏప్రిల్ లో 576 మంది, మేలో 694 మంది, జూన్ లో 870, జూలైలో 820 మంది
గడిచిన వారం రోజుల్లో సుమారు 200 మంది వరకు కుక్క కాట్లకు గురై యాంటీ రేబిస్ ఇంజక్షన్లు తీసుకున్నట్లు వైద్య శాఖ లెక్కలు వెల్లడిస్తున్నయి. మొత్తంగా గడిచిన ఏడు నెలల్లో సుమారు 5,500 మంది వరకు కుక్కల దాడిలో గాయపడడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కరీంనగర్ విద్యా నగర్ లో ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటుండగా, ఏడాదిన్నర బాలుడు నందన్ పై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నా ఒకటి, రెండు మాత్రమే వెలుగు చూస్తున్నయి.
బర్త్ కంట్రోల్ సర్జరీలపై అనుమానాలు
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 50 వేల మేర కుక్కలు ఉండగా.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 10 వేల వరకు ఉంటాయని అంచనా. వీటి సంతానాన్ని నియంత్రించేందుకు నిర్దేశించిన ఎనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) ప్రోగ్రామ్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండేళ్ల క్రితం 200 కుక్కలకు, నిరుడు 913 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ బుధవారం నుంచి ఆపరేషన్లు ప్రారంభించారు.
జిల్లాలోని మిగతా ఏరియాల్లో ఈ ప్రోగ్రామే నిర్వహించడం లేదు. స్టెరిలైజేషన్ కాంట్రాక్ట్ చేపట్టిన సంస్థ ఒక్కో కుక్కకు రూ.1650 చార్జీ చేస్తోంది. అయితే ఏటా నిర్వహిస్తున్న ఈ కుక్కల స్టెరిలైజేషన్ లెక్కల పారదర్శకతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నయి.
చర్యలు తీసుకుంటున్నం
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2023 మార్చి నుంచి నవంబర్ వరకు 913 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాం. మళ్లీ 2024 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 70 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి, సిటీలో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నం.
– రామకృష్ణ, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మేనేజర్