ఇల్లెందు, వెలుగు: మండలంలోని బొజ్జాయిగూడెం వద్ద 5.5 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బొజ్జయిగూడెం, కరెంటాఫీస్ క్రాస్ రోడ్ వద్ద ఉదయం ఎక్సైజ్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా 5.5 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితులు మహబూబాబాద్ జిల్లా నర్సంపేటకు చెందిన మార్తా సాయికుమార్, మొహమ్మద్ సోహైల్గా విచారణలో తేలింది. వారు ఆంధ్రప్రదేశ్లోని సీలేరులో గంజాయిని కొనుగోలు చేసి, తమ ప్రాంతమైన నర్సంపేట పరిసర ప్రాంతాల్లో 50, 100 గ్రాముల ప్యాకెట్ల రూపంలో ఒక్కోటి రూ.1500 నుంచి రూ.2500 వరకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు.
వారి నుంచి గంజాయి, బైక్, మోబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్సై అనిల్, హెడ్ కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హన్మంతరావు, వెంకటేశ్, విజయ్ పాల్గొన్నారు.