శిశువు విక్రయం కేసులో ఐదుగురు అరెస్ట్

హాలియా, వెలుగు : శిశువు విక్రయం కేసులో నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం పోలీసులు శుక్రవారం ఐదుగురిని అరెస్ట్  చేశారు.​  తిరుమలగిరి (సాగర్ ) ఎస్సై సురేశ్  తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రంగుండ్ల గ్రామానికి చెందిన అంగోతు సేవ, జ్యోతి దంపతులకు ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. మూడో సంతానంగా మూడు నెలల క్రితం నల్గొండ ప్రభుత్వ హాస్పటల్​లో ఆడపిల్ల జన్మించింది.

దీంతో ముగ్గురిని సాక లేక జ్యోతి దంపతులు అక్కడ హాస్పిటల్ లో స్వీపర్ గా పనిచేసే ఈ సంవరమ్మ సాయంతో పిల్లలు లేని బత్తుల సైదులు, కవిత దంపతులకు రూ.1.55 లక్షలకు పాపను అమ్మారు. ఈ ఘటనపై రంగుండ్ల అంగన్ వాడీ టీచర్  సమాచారం అందించడంతో చైల్డ్  వెల్ఫేర్  ఆఫీసర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాపను చైల్డ్  వెల్ఫేర్ కు అప్పగించారు. పాపను అమ్మిన పేరెంట్స్, కొన్నవారిని, మధ్యవర్తిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.