నకిలీ మద్యం కేసులో ఐదుగురు అరెస్ట్

నకిలీ మద్యం కేసులో ఐదుగురు అరెస్ట్
  • ప్రధాన నిందితుడు బాలరాజ్ గౌడ్
  • పరారీలో మరో ఐదుగురు 
  • 2.5 కోట్ల విలువైన లిక్కర్, తయారీ మెషీన్లు సీజ్

ఎల్బీ నగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు బింగి బాలరాజ్ గౌడ్​తో పాటు మరో నలుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.2.5 కోట్ల విలువైన నకిలీ మద్యం, 20 వేల లీటర్ల  స్పిరిట్,1500 లీటర్ల బ్లెండింగ్ చేసిన మద్యం, మద్యం తయారుచేసే మెషీన్లు,  ఒక జనరేటర్  తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో  ఉన్నారు. ఈ వివరాలను హయత్ నగర్ లోని ఎక్సైజ్ స్టేషన్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్  వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ మద్యంను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టిదిలేదన్నారు. నకిలీ మద్యం వల్ల  రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందని తెలిపారు. ఆబ్కారీ పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒడిశా వెళ్లి నకిలీ మద్యం యూనిట్ ను  సీజ్ చేసుకొని వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం పేకాట, గుడుంబా, అక్రమ  మద్యం స్థావరాలను నిర్మూలించిందన్నారు. తెలంగాణ బ్రాండ్ పేరుతో ఒడిశాలో కల్తీ మద్యం తయారీ చేస్తున్నారని తెలిపారు. 

ఇక్కడ తీగ లాగితే ఒడిశాలో డొంక కదిలిందన్నారు. ‘‘ఒడిశాలోని కటక్ జిల్లా అభయ్ పూర్ అటవీ ప్రాంతంలో మద్యం తయారీ జరిగింది. మరికొంతమందిని త్వరలోనే పట్టుకుంటం. అనుమానితుల లైసెన్స్ రద్దు చేయించినం. ఇలాంటి అక్రమాలు వేరే రాష్ట్రం వాళ్లే కాదు మన రాష్ట్రం వాళ్లు చేసినా వదిలిపెట్టం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కట్టడి చేస్తున్నం. ఇక్కడి నుంచి ఖాళీ బాటిల్స్, అట్టలు, లేబుల్స్ తీసుకొని ఒడిశాలో నకిలీ మద్యం తయారు చేస్తున్నరు” అని మంత్రి చెప్పారు. మన రాష్ట్రంలో ఆల్కహాల్ పర్సెంటేజ్  ఎట్లా ఉంటుందో అలాగే  తయారు చేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా మద్య నిషేధాన్ని ప్రకటిస్తే ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.