కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్ర్తను చేసి, నిర్బంధించి దాడి చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, కామారెడ్డి డీఎస్పీ ప్రకాశ్ఆధ్వర్యంలో కేసు ఎంక్వైరీ నడుస్తోందని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. మొదట్లో దాడి, బెదిరింపు, బట్టలు విప్పదీయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, బాధితురాలు కులం పేరుతో కూడా దూషించారని చెప్పడంతో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద మార్చి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తున్నామన్నారు.
డీఎస్పీ ప్రకాశ్కథనం ప్రకారం..బాధితురాలికి మాచారెడ్డి మండలం అక్కాపూర్‌కు చెందిన నరేశ్‌తో 8 నెలల క్రితం పరిచయం ఏర్పడగా ఇద్దరూ కలిసి రామారెడ్డి మండలంలోని ఓ ఊరిలో కిరాయికి ఉంటున్నారు. అప్పటికే నరేశ్‌కు పెండ్లయ్యింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్భార్య తరఫు బంధువులైన అక్కాపూర్‌కు చెందిన నాగారపు ఎల్లయ్య, భాగ్యలక్ష్మి అలియాస్బాలలక్ష్మి, లక్ష్మీరావులపల్లికి చెందిన మిల్లర్ రవి అలియాస్రెండ్ల రవి, పుట్ట నర్సింహులు, నరేశ్ భార్య సంధ్య మరికొందరు ఈ నెల 4న వీరి ఇంటికి వచ్చారు.
నరేశ్‌ను నిర్బంధించి మహిళ బట్టలు విప్పదీయడంతో పాటు చీపురు కట్టతో కొట్టారు. చంపుతామని బెదిరించారు. కులం పేరుతో దూషించారు. బట్టలు విప్పి కొడుతుండడాన్ని నరేశ్భార్య ఫోన్లో రికార్డు చేసింది. బాధితురాలు గురువారం రామారెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు ఎంక్వైరీ కొనసాగుతోందని, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు.