ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్గొంటుంది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం భారతదేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటి. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
భారతదేశంలో జరిగిన 5 ఘోరమైన రైలు ప్రమాదాలు
- బీహార్ లో 1981 జూన్ 6వ తేదీన జరిగిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతిపెద్ద రైలు ప్రమాదం. ఈ రైలు ప్రమాదంలో 500 నుంచి -800 మంది వరకు చనిపోయారు. బీహార్ సమీపంలోని బాగ్మతి నదిలో సహర్సా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఈ సంఘటన జరిగింది.
- ఫిరోజాబాద్ రైలు ప్రమాదంలో 358 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ సమీపంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 358 మంది మృతి చెందారు. ఈ సంఘటన 1995 ఆగస్టు 20న జరిగింది.
- అవధ్ -అస్సాం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 268 మంది మృత్యువాత పడ్డారు. ఆగస్ట్ 2, 1999న గైసల్ వద్ద అవధ్ -అస్సాం ఎక్స్‌ప్రెస్ బ్రహ్మపుత్ర మెయిల్‌ను ఢీకొనడంతో 268 మంది మరణించారు. దాదాపు 359 మంది గాయపడ్డారు. అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ గౌహతి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
- 1998 నవంబర్ 26న జరిగిన ఖన్నా రైలు ప్రమాదంలో 212 మంది చనిపోయారు. పంజాబ్‌లోని ఖన్నా వద్ద అమృత్‌సర్‌కు వెళ్లే ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్ రైలు.. పట్టాలు తప్పింది. ఈ రైలును జమ్మూ తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.
- 2010 మే 28వ తేదీన జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో 170 మంది మృతి చెందారు. ముంబైకి వెళ్లే హౌరా కుర్లా లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్‌లో మావోయిస్టులు దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖేమషులి, సర్దిహా వద్ద ఉన్న సమయంలో మావోలు దాడి చేశారు. ఈ దాడిలో 170 మంది మరణించారు.
- తాజాగా జూన్ 2వ తేదీ 2023న ఒడిశాలోని బాలాసోర్ దగ్గర బెంగళూరు -హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మరణించాగా 900 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరగనుంది.