సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్నారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
యవతకు ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసిందన్న జగ్గారెడ్డి.. బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగిందన్నారు. గాంధీ కుటుంబానికి మోసం అంటే తెలియదన్నారు జగ్గారెడ్డి. హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులని మించిన వారు ఉండరని సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని చెప్పారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న జగ్గారెడ్డి ... ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ అర్థరహింతంగా ఉన్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. ఇక ఏపీ రాజకీయాలపై ఫలితాల వెల్లడైన తరువాత మాట్లాడుతానన్నారు.