ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వండిన వంటకాలు తిని ఐదు పశువులు అస్వస్థతకు గురయ్యాయి. ఇప్పటికే ఒక పశువు మృతి చెందగా... మరొక పశువు పరిస్థితి విషమంగా ఉంది. చీమలపాడులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వంటకాలు మిగిలిపోయాయి.
ఎవరూ తినకుండా మిగిలిన వంటలను సభా ప్రాంగణం సమీపంలో పారబోశారు. రెండవ రోజు ఐదు పశువులు ఆ ఫుడ్ ను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అజ్మీర రవి అనే రైతుకు చెందిన ఒక ఆవు మృతిచెందింది. మరో ముగ్గురు రైతులకు చెందిన నాలుగు పశువులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. తమకు ఆధారమైన ఆవు చనిపోయిందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అజ్మీర రవి వేడుకుంటున్నాడు.