- మంత్రి సబితారెడ్డి ఇలాకాలోని సిద్ధాంతి స్కూల్ పరిస్థితి
- ‘మన ఊరు-మన బడి’కి ఎంపిక చేయని ఆఫీసర్లు
శంషాబాద్, వెలుగు: ఓ వైపు పిల్లలు లేరని ఏటా స్కూళ్లను మూసివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... విద్యార్థులు ఉన్నచోట కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్అవుతోంది. క్లాసు రూమ్స్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి బస్తీలోని ప్రైమరీ స్కూలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 120 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అందరికీ కలిపి ఉన్నది ఒకటే క్లాస్ రూమ్. ఉన్న ముగ్గురు టీచర్లు ఏ తరగతి పిల్లలకు పాఠం చెబుతున్నారో.. పిల్లలు ఎవరి పాఠాలు వింటున్నారో తెలియని పరిస్థితి ఉంది. పిల్లలు, టీచర్లు మధ్యాహ్నం భోజనం అదే క్లాస్‌రూంలో తింటున్నారు. లేకుంటే చెట్టు నీడలో బయట కూర్చుంటున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న మూడు టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒక్కటి కూడా వాడుకునే స్థితిలో లేదు. తాగునీటి సౌకర్యం లేదు. వాటర్ట్యాంక్ఉన్నా మోటార్ నీటి కనెక్షన్లేక వృథాగా ఉంది. మున్సిపల్ నల్లా కనెక్షన్ఉన్నా ఒక్కరోజు కూడా నీళ్లు రావట్లేదు. తాగేందుకు పిల్లలే ఇంటి నుంచి బాటిల్స్తెచ్చుకుంటున్నారు. అవి అయిపోతే గొంతెండుతూ కూర్చోవాల్సిన పరిస్థితి. గతంలో రెండు తరగతి గదులు ఉండేవని శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు కూల్చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూల్లో చదివించే స్తోమత లేక సర్కారు బడికి పంపిస్తుంటే ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమానికి సిద్ధాంతి బస్తీ స్కూల్‌ను ఎంపిక చేయకపోవడం దారుణం అంటున్నారు. స్కూల్లోని సమస్యలను స్థానిక కౌన్సిలర్, ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని టీచర్లు చెబుతున్నారు. ప్రహరీకి గేటు లేకపోవడంతో రాత్రిళ్లు స్కూల్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోందని, మద్యం తాగి సీసాలను పగలగొట్టి వెళ్తున్నారని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఐదు నెలల నుంచి బిల్లులు కూడా రావట్లేదని తెలిసింది.