- తొలి దశలో 50 ఎకరాల్లో ఒక ఇండస్ట్రీ: మంత్రి శ్రీధర్‌బాబు
- టీహబ్‌తో జపాన్ సంస్థ డెన్సో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్ఎన్వంటి ఐదు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపించాయి. బుధవారం సెక్రటేరియెట్‌లో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలను వివరించారు. తొలి దశలో భాగంగా ఒక్కో సంస్థ 50 ఎకరాల స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని శ్రీధర్‌బాబు తెలిపారు.
ఆయా సంస్థల్లో ప్రస్తుతం 2 లక్షల మంది దాకా పనిచేస్తున్నారన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫార్మా సిటీ కూడా భాగంగా ఉంటుందన్నారు. ఇక్కడ మంచినీరు, విద్యుత్తు సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు చెప్పారు. కొంగరకలాన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రోడ్‌ను నిర్మించనున్నట్టు తెలిపారు. వచ్చే జూన్ నాటికి రోడ్డు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, రోడ్డుకు సమాంతరంగా మెట్రో రైలు వ్యవస్థనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మిటరీలు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పరిశ్రమల విద్యుత్తు విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ పాల్గొన్నారు.
టీహబ్‌తో డెన్సో ఒప్పందం
వాహనాల ఉత్పత్తి రంగంలో రాష్ట్రం కీలకంగా ఎదుగుతున్నదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆటోమోటివ్ డిజైన్, చిప్‌ల తయారీ, సెన్సర్ ఇంజనీరింగ్ సంస్థలు రాష్ట్ర ఆటోమోటివ్ సెక్టార్అభివృద్ధికి తోడ్పతాయన్నారు. జపాన్‌కు చెందిన ‘డెన్సో’ స్టార్టప్ ఇంక్యూబేటర్.. టీహబ్‌తో బుధవారం ఒప్పందం చేసుకుందన్నారు.
ఆటోమోటివ్ రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, ఎక్సైడ్, అమర రాజా బ్యాటరీస్ వంటి దిగ్గజ సంస్థలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయని, సంప్రదాయ ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఈవీ టెక్నాలజీకి తెలంగాణ కేంద్రంగా మారిందని వివరించారు. కార్యక్రమంలో డెన్సో ఇండియా రీజనల్ సీఈవో యశుహిరో లిడా, డైరెక్టర్ ఎయిజీ సోబుయే, వైస్ ప్రెసిడెంట్ తొమొనొరి ఇనుయె, నవీన్ వర్మ, టీహబ్ సీఈవో సుజీత్ జాగిర్దార్ తదితరులు పాల్గొన్నారు.