వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి

వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి

 

  •     గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన అధికారులు
  •     కెపాసిటీకి మించి ఉంచడంతో అనారోగ్యంతో మృతి
  •     మరో గోశాల ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం 
  •     ఎక్కువైతే  రైతులకు ఇవ్వాలన్న డిమాండ్​

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి తిప్పాపూర్​గోశాలలో ఉన్న ఐదు కోడెలు చనిపోయాయి. ఆలయ అధికారులు వీటిని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఆలయానికి సంబంధించి తిప్పాపూర్​తో పాటు జగిత్యాల బస్టాండ్​దగ్గర గోశాలలు ఉన్నాయి. ఇందులో పరిమితికి మించిన కోడెలు, ఆవులు ఉంచుతున్నారు. ఇంతకుముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గోశాలలు నడిపే వారికి ఇక్కడి నుంచే కోడెలను పంపించేవారు. అయితే, అక్కడ గోశాల ఉందా లేదా అనేది పట్టించుకునేవారు కాదు. దీంతో అవి పక్కదారి పడుతున్నాయని వీ6 వెలుగులో జనవరి ఆరో తేదీన ఓ కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు కోడెలను బయటకు పంపడం ఆపివేశారు. దీంతో పట్టణంలోని రెండు గోశాలల్లో కెపాసిటీకి మించి కోడెలు చేరాయి.

మరో గోశాల ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో కోడెల సంరక్షణ కష్టంగా మారి అనారోగ్యంతో చనిపోతున్నాయి. ఇప్పుడు చనిపోయిన ఐదు కోడెలు కూడా ఇలాగే మరణించాయని తెలుస్తోంది. బయటకు తెలిస్తే లేని పోని గొడవ అని భావించిన ఆలయ అధికారులు ఎవరికీ తెలియకుండా పాతిపెట్టినట్టు తెలుస్తోంది. మూడు రోజుల కింద కూడా తిప్పాపూర్​దగ్గర గోశాల బురదమయం కావడంతో కోడెలు ఇబ్బందులు పడ్డాయి. వీ6 వెలుగులో కథనం ప్రచురితం కావడంతో హెల్త్​క్యాంపు పెట్టి ఊరుకున్నారు. ఇంతలోనే కోడెలు చనిపోయాయి. కోడెలను, అవులను పాత పద్ధతిలోనే అర్హులైన రైతులకు ఇవ్వాలన్న డిమాండ్ ​వినిపిస్తున్నది.