
- తీర్థాల జాతరకు సర్వం సిద్ధం..
- శివనామస్మరణతో మారుమోగనున్న శైవ క్షేత్రం
- అన్ని ఏర్పాట్లు పూర్తి... 20 ఎకరాల్లో 10 పార్కింగ్
- రేపు వైభవంగా ప్రారంభం కానున్న కూడలి జాతర
ఖమ్మం రూరల్, వెలుగు : ఐదురోజుల పాటు నిర్వహించనున్న తీర్థాల సంగమేశ్వరుని జాతరకు సర్వం సిద్ధమైంది. ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రాంప్రసాద్ పలుమార్లు సమీక్ష చేశారు. అయిదు రోజుల్లో లక్షలాదిగా తరలి రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 చోట్ల పార్కింగ్ స్థలాలను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
పార్కింగ్ ఏరియాలు
- ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే వాహనాలు దానవాయిగూడెం, రామన్నపేట, కామాంచికల్ మీదుగా వచ్చి మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డు కి ఇరువైపుల సూచించిన చోట ఆర్టీసీ బస్సులు మినహా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి. ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పాటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలో వెళ్లి కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి.
- డోర్నకల్, పాపటిపల్లి మీదుగా వచ్చే వాహనాలు కామంచికల్ గ్రామానికి ముందు చెరువు వద్ద కుడి వైపు ఉన్న జామాయిల్ తోట దగ్గర పార్కింగ్ లో నిలపాలి.
- మద్దివారిగూడెం, మంగళగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలకు తీర్దాల గ్రామ ప్రవేశం ఎదుట పార్క్ చేయాలి.
- కురవి, ములకలపల్లి వైపు నుంచి తీర్థాల వచ్చే భక్తుల వాహనాలు ఎంవీ పాలెం, గుండాల తండా మీదుగా తీర్దాలకు చేరుకోవాలి.
- ఖమ్మం రూరల్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, పల్లెగూడెం, గోళ్ళపాడు మీదుగా ఆకేరు బ్రిడ్జి వరకు అనుమతిస్తారు.
- ఖమ్మం పట్టణం నుంచి భక్తులు దర్శనం అనంతరం గోళ్లపాడు వన్‌వే రహదారి మీదుగా కామంచికల్ పంచాయతీ దగ్గర నుంచి ముత్యాలగూడెం మీదుగా కోయ చిలక వైపు నుంచి ఖమ్మం వెళ్లాలి.
- పల్లెగూడెం మీదుగా వచ్చే వాహనాలు ఎంవీ పాలెం మీదుగా గూడూరుపాడు , తనగంపాడు, గుండాల తండా మీదుగ తీర్దాల రావాలి. టెంపుల్ కు చుట్టుపక్కల ఒక కిలోమీటరు వరకు వాహనాలకు అనుమతి లేదు. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలో నిలపాలి.
నీలాద్రి కి శివరాత్రి శోభ..
పెనుబల్లి : కాకతీయ రాజులు ప్రతిష్ఠించిన నీలాద్రి ఆలయం శివరాత్రికి ముస్తాబు అయ్యింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో జరిగే జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది లక్ష యాభై వేల మంది భక్తులు జాతరకు వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవ తో మొదలు అయ్యి రాత్రి 9.30 కి నీలాద్రీశ్వరుని కల్యాణంతో జాతర ముగుస్తుంది. ఉదయం 11 నుంచి లక్ష మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుపతి నుంచి వచ్చిన శివ భక్తుడు బోధనపు విజయకుమార్ ఆధ్వర్యంలో కోటి రుద్రక్షాలతో ఆలయ ప్రాంగణంలో శివ లింగం ఏర్పాటు చేస్తున్నారు. మృత్యుంజయ యాగం చేసి, కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. అభిషేకం అనంతరం రుద్రక్షాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. గత ఏడాది ట్రాఫిక్ జామ్ సమస్య లు ఉండటం వల్ల ఈ ఏడాది వీఎం బంజరు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ఈఓ పాకాల వెంకటరమణ, చైర్మన్ చీకటి నరసింహారావు, రూరల్ సీఐ ముత్తు లింగయ్య, ఎస్ఐ వెంకటేశ్ మహా శివరాత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.