రన్​వేపై ఢీకొన్న విమానాలు.. జపాన్ లో ఐదుగురు మృతి

  • కోస్ట్ గార్డ్ విమానాన్ని ప్యాసింజర్ ఫ్లైట్ ఢీకొట్టడంతో ప్రమాదం    

టోక్యో: జపాన్ లో ఘోరం జరిగింది. రన్ వేపై రెండు విమానాలు ఢీకొని, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టోక్యోలోని హనేడా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న ప్యాసింజర్ ఫ్లైట్.. అక్కడ రన్ వేపై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోస్ట్ గార్డ్ విమానంలోని ఐదుగురు సిబ్బంది చనిపోయారు. ప్యాసింజర్ ఫ్లైట్ లోని వారంతా క్షేమంగా బయటపడ్డారు.

ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటకు..

జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ–350 ఫ్లైట్ మంగళవారం 369 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బందితో షిన్ చిటోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. హనేడా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న టైమ్ లో రన్ వేపై కోస్ట్ గార్డ్ కు చెందిన ఎంఏ–722 విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన ప్యాసింజర్ ఫ్లైట్ కొంతదూరం మంటలతోనే ప్రయాణించింది. సిబ్బంది వెంటనే ఫ్లైట్ ఆపేసి, ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా దించారు. కొద్దిసేపటికే ఫ్లైట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. 70కి పైగా ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. కోస్ట్ గార్డ్ విమానం భూకంప బాధితులకు నిత్యావసర సరుకులు తీసుకెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పైలెట్ గాయాలతో బయటపడగా.. మిగతా ఐదుగురు సిబ్బంది చనిపోయారు. ప్రమాదంపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని,  విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.

వీడియోలు వైరల్..

విమానానికి మంటలు అంటుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానంలో మొత్తం పొగ కమ్ముకోగా ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. ‘‘ఒక్కసారిగా విమానంలో మొత్తం పొగ కమ్ముకుంది. మాకు ఏమీ కనిపించలేదు. ఎలాగోలా ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా బయటకు వచ్చాం” అని ఓ ప్యాసింజర్ చెప్పారు. ‘‘ఇక నేను చనిపోతానని అనుకున్న” అని మరో ప్యాసింజర్ ట్వీట్ చేశారు.