
పాపన్నపేట, వెలుగు: ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. మెదక్‌జిల్లా పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బట్టి బాలయ్య (57) పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
పొలం వద్ద మోటారు పని చేయకపోవడంతో రిపేర్ చేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి డెడ్‌బాడీని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నీట మునిగి బాలుడు..
నీట మునిగి బాలుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ సాయిలు కుమారుడు దుర్గయ్య (12) శనివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు స్థానిక రెడ్ల చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం చెరువు వద్ద దుర్గయ్య దుస్తులు కనిపించాయి.
అనుమానం వచ్చి చెరువులో గాలించగా డెడ్‌బాడీ దొరికింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..
జిన్నారం: మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డపోతారం శివారులో రోడ్డుపై వెళ్తున్న 40- ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.
మద్యానికి బానిసై సూసైడ్..
దుబ్బాక : మద్యానికి బానిసై ఒకరు సూసైడ్చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తికి చెందిన సిర్ర ఎల్లయ్య(43) మూడు నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఇంటికి తాగిరాగా భార్య మందలించింది. మనస్తాపానికి గురైన ఎల్లయ్య పశువులకు గడ్డి కొసుకొస్తానని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పొలం వద్దకు వెళ్లి చూడగా ఎల్లయ్య ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్యంతో మాజీ సర్పంచ్..
రామాయంపేట: మండలంలోని రాయిలాపూర్ మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి (68) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆర్ .వెంకటాపూర్ గ్రామానికి చెందిన అతను రాయిలాపూర్ గ్రామ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ శివారు గుండ్ల పోచంపల్లిలో నివాసం ఉంటున్న ఎల్లారెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు.