ఆర్మీ రిక్రూట్​మెంట్​కు ఐదు జిల్లాల నుంచి హాజరైన అభ్యర్థులు

  • నేడు ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల యువతకు అవకాశం

సూర్యాపేట, వెలుగు: అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ రెండో రోజు 200 మంది ఎంపికయ్యారు. మొదటి రోజు వర్షం, అఫిడవిట్ల గందరగోళం నెలకొనడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండో రోజు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. శనివారం వర్షం కారణంగా దెబ్బతిన్న రన్నింగ్ ట్రాక్ ను బాగు చేశారు. కాలేజీ గ్రౌండ్ లోనే రన్నింగ్ పోటీలను నిర్వహించారు. సిరిసిల్ల, హనుమకొండ, మహబూబాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన 3,116 మంది అగ్నిపథ్​ పోర్టల్ లో నమోదు చేసుకోగా వీరిలో 2 వేల మంది హాజరయ్యారు.

శనివారం అర్ధరాత్రి నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఎత్తు, బరువు, ఛాతీ పరీక్షలలో 700 మందిని రిజెక్ట్ అయ్యారు. 1,300 మంది అభ్యర్థులకు 1,600 మీటర్ల రన్నింగ్, లాంగ్‌‌ జంప్‌‌, పుషప్స్‌‌ పరీక్షలను నిర్వహించారు. వీరిలో 200 మందిని సెలెక్ట్ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రిక్రూట్‌‌మెంట్‌‌జరుగుతోంది. ఆర్మీ అధికారుల ప్రత్యేక టీంతో పాటు ఆర్మీ డైరెక్టర్‌‌కు సంబంధించిన మరో టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మూడో రోజు సోమవారం ఖమ్మం, వరంగల్ అర్బన్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.