
న్యూఢిల్లీ: మాజీ సీఎంలతో పాటు చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి గెలిచిన, ఓడిపోయిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం ఐదుగురు సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గంలో ఉన్నారు. వీరంతా ఆదివారం సెంట్రల్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తొలిసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
అస్సాం మాజీ సీఎం సర్బానందా సోనోవాల్‌కు కూడా మోదీ కేబినెట్లో చోటు దక్కింది. కాగా, సోనోవాల్ మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలందించారు. యూపీలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన జితిన్ ప్రసాద్ పిలిభిత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కూటమి అభ్యర్థి భరత్ శరణ్ గంగ్వార్‌ను ఈయన ఓడించారు. జితిన్ ప్రసాద్‌ను మోదీ తన కేబినెట్లో తీసుకున్నారు. పంజాబ్‌లోని లూధియానా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రవ్నీత్ సింగ్ బిట్టుకు కూడా కేబినెట్ హోదా దక్కింది. ఈయన లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. లూథియానా నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజావారింగ్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ.. బిట్టును మంత్రివర్గంలో తీసుకున్నారు.