కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు శుక్రవారం కరీంనగర్ కోర్టులో హాజరయ్యారు. 2008లో ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర పన్నారని 38 మందిపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైం నం.1/2008 నమోదైంది. ఇందులో అప్పటి కేంద్ర కమిటీ సభ్యులైన 32 మంది పేర్లున్నాయి.
మొదటి ముద్దాయిగా మల్లా రాజిరెడ్డితో పాటు ప్రమోద్ మిశ్రా, కోబాడ్ గాంధీ, జైస్పాల్ సింగ్, వారణాసి సుబ్రహ్మణ్యం, అమిత్ బాగ్చి, అఖిలేష్ జాదవ్, బచ్చు ప్రసాద్ సింగ్, జెన్ను ముఖర్జీలు అరెస్టయి వివిధ జైళ్లలో ఉండగా, 2009, 2010లో వీరిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు.తర్వాత ఎవరూ కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు.
అమిత్ బాగ్చి ఝార్ఖండ్ రాంచి జైలులో ఉండగా కోర్టు ఆదేశాలపై శుక్రవారం ఎస్కార్ట్ తో తీసుకొచ్చి హాజరుపరిచారు. ఇప్పటికే బెయిల్ లభించి బయట ఉన్న కోబాడ్ గాంధీ, వారణాసి సుబ్రహ్మణ్యం, బచ్చు ప్రసాద్ సింగ్ నేరుగా కోర్టుకు హాజరయ్యారు. మరో నిందితుడు అఖిలేష్ జాదవ్ జైల్లో ఉండగా అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.