టెన్త్ క్వశ్చర్ పేపర్ లీక్​ నిందితుల అరెస్ట్

టెన్త్ క్వశ్చర్ పేపర్ లీక్​ నిందితుల అరెస్ట్
  • మరో ఆరుగురిని ఎంక్వైరీ చేస్తున్న నల్గొండ జిల్లా పోలీసులు

నల్గొండ అర్బన్, వెలుగు: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్​ కేసులో నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న టెన్త్ ఎగ్జామ్స్ లో భాగంగా తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా.. అరగంట తర్వాత వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ వైరల్ అయి డీఈఓకు చేరింది.  వెంటనే ఎంఈఓకు ఫోన్ చేసి విచారణ చేయాలని ఆదేశించారు.

నకిరేకల్ టౌన్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్ లోకి వెనక వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి  విద్యార్థిని క్వశ్చన్ పేపర్ సెల్ ఫోన్ లో ఫొటో తీసుకుని వెళ్లాడని తేలింది. ఎంఈఓ వెంటనే  నకిరేకల్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ –1997 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు.

చిట్ల ఆకాశ్​, చిట్ల శివ, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, పోగుల శ్రీరాములు, తలారి అఖిల్ కుమార్ , ముత్యాల వంశీ, పలాస అనిల్ కుమార్, పళ్ల మనోహర్ ప్రసాద్, రాహుల్, మరో ఇద్దరు మైనర్లను నిందితులుగా గుర్తించారు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే తమ బంధువుల పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేందుకే  క్వశ్చన్ పేపర్ కోసం సెంటర్ వద్ద కు వెళ్లారు. సెంటర్ వెనకవైపు నుంచి వెళ్లి విద్యార్థిని వద్ద  క్వశ్చన్ పేపర్ ను ఫొటో తీసుకుని వెళ్లిపోయారు. 13 మంది నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మరో ఆరుగురిని విచారణ చేస్తుండగా.. ఒకరు పరారీలో ఉన్నారు.