- నేడు విచారణ
- క్యాట్‌లో ఐఏఎస్ ఆఫీసర్లు వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ సోమవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ వేశారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తెలంగాణలోనే తాము కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ సృజన కూడా క్యాట్‌లో పిటిషన్ వేశారు. తనను ఏపీలోనే కొనసాగించాలని అందులో కోరారు. ఈ పిటిషన్లపై క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పునర్విభజన యాక్ట్ ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది.
ఈ లిస్టులో.. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. వీరిని సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్తామని అప్లికేషన్ పెట్టుకున్న ఎస్.ఎస్.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్ చేసింది. వీరిద్దరూ ఏపీలోనే కొనసాగుతారు. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ.. వాణీప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, సృజన క్యాట్‌ను ఆశ్రయించారు.
సీఎస్‌తో భేటీ
డీవోపీటీ ఆదేశాలు, క్యాట్‌లో పిటిషన్‌పై ఐఏఎస్ ఆఫీసర్లు రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ సోమవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమా రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకవేళ క్యాట్ ఆదే శాలు అనుకూలంగా వస్తే సరే.. ప్రతికూలంగా ఉంటే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వారు చర్చించినట్టు తెలుస్తున్నది. అవసరమైతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర ఒప్పందంతో ఐఏఎస్‌లను ఆయా రాష్ట్రాల్లో కొనసాగించుకునే వెసులుబాటును కూడా పరిశీలిస్తున్నారు.