
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు పెను ముప్పు తప్పింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐదు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లను పోలీసులు నిర్వీర్యం చేశారు. బీజాపూర్ జిల్లా మంకేలి గ్రామ సమీపంలోని మట్టి ట్రాక్‌పై ఈ ఐఈడీలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం (CAF), స్థానిక పోలీసుల సంయుక్త బృందం సోమవారం (ఏప్రిల్ 14) బీజాపూర్‌లో మందుపాతర్ల తొలగింపు ఆపరేషన్ చేపట్టింది.
ఈ క్రమంలోనే మంకేలి గ్రామ సమీపంలోని మట్టిరోడ్డుపై పోలీసులు ఐఈడీలను గుర్తించారు. మొత్తం 5 ఐఈడీ బాంబ్లను గుర్తించినట్లు తెలిపారు. ఒక్కొక్కటి 2 కిలోల బరువున్న మూడు ఐఈడీలను బీర్ బాటిళ్లలో పెట్టగా.. 3 కిలోల నుంచి 5 కిలోల బరువున్న మరో రెండు ఐఈడీలను స్టీల్ టిఫిన్ బాక్సులో పెట్టి రోడ్డు కింద అమర్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఓ సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ‘‘భూమి నుంచి 3 మీటర్ల నుంచి 5 మీటర్ల లోతులో వరుసగా అమర్చిన ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఐఈడీలలో కమాండ్ స్విచ్ మెకానిజం ఉపయోగించబడింది. భద్రతా దళాలే లక్ష్యంగా ఐఈడీలు అమర్చారు. ఐఈడీలను ముందుగానే గుర్తించి నిర్వీర్యంతో చేయడంతో ఒక పెద్ద విషాదం తప్పింది’’ అని పేర్కొన్నారు. కాగా, వరుస ఎన్ కౌంటర్లలో తమ సభ్యులను హతం చేస్తోన్న భద్రతా దళాలే లక్ష్యంగా 2025 జనవరి 6న బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు శక్తివంతమైన ఐఈడీతో జవాన్ల వాహనాన్ని పేల్చివేశారు. ఈ పేలుడులో 8 మంది జవాన్లు, డ్రైవర్ మరణించారు.