అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా వాటర్ ఫాల్స్‌ను చూసేందుకు వచ్చిన ఐదుగురు వైద్య విద్యార్థులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎగువ నుండి వస్తోన్న వరదతో పాటు అల్లూరి జిల్లాలో కురిసిన వర్షానికి జలతరంగిణి జలపాతం పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో వాటర్ ఫాల్స్ అందాలను వీక్షించేందుకు -ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు పిక్నిక్కు వచ్చారు. సరదాగా జలపాతంలోకి దిగి ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా జలపాతానికి వరద పొటెత్తింది.
దీంతో స్నానానికి దిగిన ఐదుగురు మెడికోలు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఇందులో ఇద్దరు విద్యార్థులు కాజ్ వే వద్ద చిక్కుకుని సురక్షితంగా బయటకు రాగా.. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహయంతో గల్లంతైన మెడికోల కోసం సహయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో వర్షం కురుస్తుండటంతో పాటు చీకటి పడటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. గల్లంతైన విద్యార్థులను హర్షదీప్, సౌమ్య, అమృతగా పోలీసులు ఐడెంటీఫై చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.