సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి ప్రాంతంలో రైతాంగానికి మంచి రోజులు వస్తాయని 16 ఏండ్లుగా రైతులు ఎదురు చూస్తున్న మెగా ఫుడ్ పార్క్ నేడు ప్రారంభం కానుంది. గురువారం ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరుకానున్నారు.
ఓ సారి వైఎస్సార్.. మరోసారి కేటీఆర్ శంకుస్థాపన
జలగం వెంకటరావు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో 203 ఎకరాల భూమిని టీఎస్ఐఐఐసీ సంస్థద్వారా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం కేటాయించగా, నాటి సీఎం వైఎస్సార్ 2008 జనవరి 7న శంకుస్థాపన చేశారు. అప్పట్లోనే రూ.119 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో అడుగు ముందుకు పడకపోవడంతో 2016 నవంబర్ 13న అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసి మౌలిక సదుపాయాలు కల్పించారు.
మొత్తం రూ.199 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల భాగస్వామి కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు, నాబార్డు రూ.32 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది. సేకరించిన 203 ఎకరాలను 3 కేటగిరీలుగా విభజించి లీజు నిర్ణయించారు. ఇందులో 60 ఎకరాలను మెగా ఫుడ్ పార్క్ కోసం 60 ఎకరాల విస్తీర్ణాన్ని ఇప్పటికే అభివృద్ధి చేయగా, మిగిలిన భూమిలో స్పెషల్ ప్రాసెసింగ్ జోన్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రజెస్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.
వీటిలో మెగా ఫుడ్ పార్క్ లో యెల్లో అండ్ గ్రీన్ సంస్థ మామిడి, జామ, బొప్పాయి పల్ప్ తయారీ మరిశ్రమ, ట్రాన్సెండ్ ఫుడ్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీడి పప్పు ప్రాసెసింగ్ యూనిట్ ను నెలకొల్పాయి. స్పెషల్ ప్రాసెసింగ్ జోన్ లో రెండు ఫ్లాట్లను రైస్ మిల్ ఏర్పాటు చేసుకునేందుకు ఓ సంస్థ అంగీకారం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా16 ఏండ్ల రైతుల, నిరుద్యోగుల నిరీక్షణ నేటితో ఫలించనుంది.