
- నిర్ణీత టైమ్‌కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి
- 1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది
- ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్‌కు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నామని, పరీక్షల నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. అయితే, 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని స్టూడెంట్లకు సూచించారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయితో కలిసి కృష్ణ ఆదిత్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వారికోసం 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఫస్టియర్ లో 4,88,448 మంది, సెకండియర్ లో 5,08,523 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 1,532 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, అంతే మొత్తంలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. అలాగే మొత్తం 29,992 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు ఆయన వివరించారు.
సీసీకెమెరాల నిఘాలోనే..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,532 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. వీటన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. ప్రతి 45 సెంటర్లకు ఇంటర్ బోర్డులో ఒక స్క్రీన్ ఏర్పాటు చేశామని, మొత్తంగా 31 స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి ప్రశ్నాపత్రంపై యూనిక్ కోడ్ ప్రింట్ చేశామని, ఏ ప్రశ్న పత్రం ఎవరికి వెళ్తుందో ఈజీగా తెలిసిపోతుందని చెప్పారు.
ధైర్యంగా పరీక్షలు రాయండి
విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా పరీక్షలు రాయాలని కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. అయితే, ఇంటర్ పరీక్షలకు టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ ను అమలు చేయబోతున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల పాస్ పర్సంటేజీ పెంచేందుకు ప్రత్యేక క్లాసులు, స్లిప్ టెస్టులు నిర్వహించామని, ఈ సారి ప్రభుత్వ కాలేజీల్లో పర్సంటేజీ పెరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. జవాబు పత్రాల మూల్యంకనం ఆఫ్ లైన్ లో.. మ్యాన్యువల్ పద్ధతిలోనే చేపడుతున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ ఎవాల్యుయేషన్ చేయడం లేదని స్పష్టంచేశారు.
చేతిరాతతోనే ఆ పరీక్షలు..
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు అధికారుల తీరు మారడం లేదు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో మరాఠీ, కన్నడ మీడియం పేపర్లను ప్రింట్ చేయించలేదు. చేతిరాతతోనే ప్రశ్నాపత్రాలను అందిస్తామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. వచ్చే ఏడాది ఈ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు