ఐదు ఖాళీలపైనే అందరి గురి!

ఐదు ఖాళీలపైనే అందరి గురి!
  • మార్చిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ 
  • కాంగ్రెస్‌కు నాలుగు, బీఆర్ఎస్‌కు ఒకటి దక్కే చాన్స్ 
  • కాంగ్రెస్‌ను ఒక్కో సీటు అడుగుతున్న సీపీఐ, ఎంఐఎం 
  • నాలుగు పార్టీల నుంచి భారీగా ఆశావహులు  
  • హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగడం, పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల్లోని ఆశావహులంతా ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. 

కాంగ్రెస్‌కు నాలుగు, బీఆర్ఎస్‌కు ఒకటి దక్కే చాన్స్ ఉండడం.. పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఒక్కటి, ఎంఐఎంకు ఒక్కటి దక్కే అవకాశముందనే వార్తలు రావడంతో ఎలాంటి పదవుల్లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లంతా హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 

హైదరాబాద్‌లోని నేతలతో పాటు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తున్న ఆశావహులతో ముఖ్య నేతల ఇండ్లు, క్యాంప్​ ఆఫీసులు, పార్టీ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. 

వచ్చే నెల 3న నోటిఫికేషన్​..

ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29న ముగియనున్నది. ఖాళీ కానున్న స్థానాలకు వచ్చే నెల 3న నోటిఫికేషన్ రానుంది. 20న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఉంటాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎంపికై ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం కూడా ఈ ఏడాది ఆగస్టు 6న ముగియనున్నది. 

అయితే ఈ  స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల్లో ఆశావహుల సందడి మొదలైంది. చట్టసభలో అడుగు పెట్టాలని ఆశిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా బయోడేటాలు తయారు చేసి .. తమకు  తెలిసినవారి ద్వారా పార్టీ హైకమాండ్‌‌ను ఆశ్రయిస్తున్నారు. 

కాంగ్రెస్‌‌కు నాలుగు.. బీఆర్ఎస్‌‌కు ఒక్కటి  

ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా.. ఇందులో కాంగ్రెస్‌‌కు 4 , బీఆర్ఎస్‌‌కు ఒక్కటి దక్కే చాన్స్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల కాంగ్రెస్, 39 స్థానాల్లో  బీఆర్ఎస్ గెలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అధికార పార్టీ బలం 65కు చేరగా.. బీఆర్ఎస్ సంఖ్య 38కి తగ్గింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌లో చేరడంతో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. 

వచ్చే నెలలో ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సిఉంటుంది. ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్‌‌కు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్‌‌కు దక్కే నాలుగు స్థానాల్లో ఒక్కటి ఎంఐఎంకు కేటాయించవచ్చునని తెలుస్తున్నది. పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​హామీ ఇచ్చిందని, ఈసారి తమకు ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతున్నది.

రేపోమాపో సీఎంను కలిసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. కాగా ఆ పార్టీ నుంచి సీనియర్​లీడర్లు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే సీపీఐకి ఒక్క సీటు ఇస్తారా? త్వరలో ఖాళీ కానున్న సీటు ఇస్తామని బుజ్జగిస్తారా? అన్న చర్చ నడుస్తున్నది. 

ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌‌కు పూర్తి సానుకూలంగా ఉంది. ఇప్పుడు ఖాళీ అవుతున్న స్థానాల్లో ఒక్కటి ఎంఐఎందే కావడంతో అది తమకే ఇవ్వాలని సీఎం రేవంత్‌‌పై ఆ పార్టీ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది.   

భారీగా ఆశావహులు 

రాష్ట్రంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంతోమంది నాయకులు పదవుల కోసం క్యూలో ఉన్నారు.  ఇప్పటికే చాలామంది పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లే దారులు వెతుకుతున్నారు. సీఎం రేవంత్​రెడ్డితో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, పార్టీ ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌‌ను  కలిసి తాము పార్టీకి చేసిన సేవల గురించి చెప్పేందుకు ప్లాన్​చేసుకుంటున్నారు. 

ఎస్సీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీల నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , ట్రైకార్​ చైర్మన్​ బెల్లయ్య నాయక్ రేసులో ఉన్నారు. బీసీల నుంచి యాదవ, కుర్మ, ముదిరాజ్ నేతలు సీటుపై కన్నేశారు. యాదవుల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు చరణ్ కౌశిక్, కుర్మ సామాజిక వర్గం నుంచి  మహిళా నేత గద్వాల జడ్పీ మాజీ చైర్​పర్సన్ సరితాయాదవ్, ముదిరాజ్ వర్గం నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా రేసులో ఉన్నట్టు తెలిసింది. మైనార్టీ సామాజికవర్గం నుంచి సీనియర్ నేత షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్‌‌చార్జ్ ఫిరోజ్ ఖాన్, సీఎం రేవంత్ సన్నిహితుడు ఫహీం ఖురేషీ తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. 

ఓసీ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, పీసీసీ మీడియా ఇన్‌‌చార్జ్ సామ రామ్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, కుసుమ కుమార్ సీటు ఆశిస్తున్నారు. అయితే అసెంబ్లీ, లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వొద్దని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున చాలామంది సీనియర్లకు నిరాశే ఎదురుకానుంది.   

బీఆర్ఎస్‌‌లో చాన్స్ ఎవరికి?

బీఆర్ఎస్​నుంచి ఒక్కరికే అవకాశం ఉండగా ఆ చాన్స్​ఎవరికి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రిటైర్ అవుతున్న వారిలో ఎవరికైనా  తిరిగి అవకాశం ఇస్తారా? లేక కొత్తవారిని తెరపైకి తెస్తారా? అన్నది తేలాల్సిఉంది. ప్రస్తుతం మండలిలో పార్టీ విప్‌‌గా ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌‌ను రెన్యూవల్​చేసే  అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

మండలిలో ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్టీ నేత ఆమె ఒక్కరే. ఆమెను పక్కనపెడ్తే ఎస్టీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న సంకేతాలు పోతాయని అంటున్నారు. పార్టీ నుంచి మాజీ మంత్రులు శ్రీనివాస్​గౌడ్, ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు మరికొంత మంది సీనియర్లు లైన్‌‌లో ఉన్నారు. 

గతంలో గవర్నర్​ కోటాలో సిఫార్సు చేయగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళిసై రిజెక్ట్​చేశారు. ఈ నేపథ్యంలో వారిలో ఎవరికైనా చాన్స్​ఇస్తారా? అన్న చర్చ కూడా సాగుతున్నది.  పలువురు ఆశావహులు  ఎర్రవల్లి ఫాంహౌజ్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు.  

పార్టీ మారినోళ్లు ఓటింగ్‌‌లో ​పాల్గొంటారా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్​పెట్టింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అనర్హత అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్​జారీ చేసి.. కాంగ్రెస్‌‌కు ఓటు వేస్తే, వారిని ఇరుకునపెట్టవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది  ఎమ్మెల్యేలు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనేది పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు ఒక్కటి కలిపి, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది. వచ్చే ఫలితానికి ఒక్కటి కలిపితే, అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి  ఒక్కటి కలిపి, 119ని దానితో భాగిస్తే 19.83 వస్తుంది. దీనికి ఒక్కటి కలిపితే 20 దాటుతున్నది. ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు. ఒకవేళ పోలింగ్​ అనివార్యమైతే.. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటే, ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 20  ఓట్లు రావాలి. సభ్యులెవరైనా గైర్హాజరైతే అది తగ్గుతుంది.