విధేయులకు పెద్దపీట .. ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి పదవులు

విధేయులకు పెద్దపీట .. ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి పదవులు
  • వెయిటింగ్​లో మరికొందరు ఆశావాహులు
  • రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కోసం ప్రయత్నాలు

అధికార కాంగ్రెస్​కు బలమైన జిల్లా కావడంతో ఊహించినట్టుగానే నామినేటెడ్ ​పదవుల భర్తీలో ఉమ్మడి ఖమ్మంకు మంచి ప్రాతినిధ్యం దక్కింది. విధేయతకు పెద్దపీట వేస్తూ మొత్తం ఐదుగురికి అధిష్ఠానం పదవులు కట్టబెట్టింది.   

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి జిల్లాలో పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్​ గెల్చుకోవడం, తర్వాత ఒక్క బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పార్టీ మారడం, కేబినెట్​లో ముగ్గురు మంత్రులు ఉండడంతో ఇక్కడి నుంచి నామినేటెడ్ పదవుల కోసం పోటీ పెరిగింది. అయితే, విధేయతే ప్రామాణికంగా స్టేట్ వేర్‌ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్​గా రాయల నాగేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్​గా మువ్వా విజయ్​ బాబు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్​ గా నాయుడు సత్యనారాయణ, బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్​గా నూతి శ్రీకాంత్​ను ప్రభుత్వం నియమించింది. 

అందరూ వెళ్లినా.. కాంగ్రెస్​ను నమ్ముకొని 

వ్యవసాయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన వీరయ్య ఎంఏ వరకు చదివారు. 1999, 2004లో ములుగు, 2018లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచిన సమయంలో జిల్లాలోని ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్​లో చేరగా, వీరయ్య ఒక్కరే పార్టీని నమ్ముకొని వెన్నెముకగా నిలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగినప్పటికీ ఓటమి చెందారు.

పొంగులేటి సన్నిహితుడిగా..

మువ్వా విజయ్​ బాబు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్​గా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి బీఆర్ఎస్​లో ఉన్నప్పటి నుంచి ఆయనకు సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన వెంట కాంగ్రెస్​లో చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు ఇన్​చార్జిగా పనిచేశారు. తాజాగా తనకు పదవి దక్కడంతో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి ఆశీస్సులతో..

మరో నేత రాయల నాగేశ్వరరావు రెండు సార్లు పార్టీ టికెట్​ను ఆశించి భంగపడ్డారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున పోటీచేసి బీఆర్ఎస్​ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. మొన్నటి ఎలక్షన్లలో పాలేరు నుంచి బరిలో దిగాలని భావించినా పొంగులేటి రాకతో ఛాన్స్ దక్కలేదు. దీంతో ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లభించింది. మిగిలిన వారిలో నాయుడు సత్యనారాయణ, నూతి శ్రీకాంత్ ఇద్దరూ వైరా నియోజకవర్గానికి చెందిన వారైనా, హైదరాబాద్​లో స్థిరపడి అక్కడి పాలిటిక్స్​లో యాక్టివ్​గా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులతోనే వీరికి పదవులు దక్కాయని ప్రచారముంది. 

పదవులపై మరికొందరికి ఆశలు

వీరే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నామినేటెడ్​ పదవులపై చాలా మంది లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ​అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు సాధు రమేష్​ రెడ్డి, కమర్తపు మురళి, బొర్రా రాజశేఖర్​ రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్​అధ్యక్షుడు జావేద్, మద్ది శ్రీనివాస్​ రెడ్డి, నాగ సీతారాములు, మిక్కిలినేని నరేంద్ర, విజయాబాయి తదితరులు కూడా రేసులో ఉన్నారు. వీరే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు చాలా మంది మార్కెట్ కమిటీలు, ఆలయ చైర్మన్ల పదవులు, ఇతర మండల స్థాయి పదవులు కోరుకుంటున్నారు.