వేర్వేరు జిల్లాలో .. ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు

వేర్వేరు జిల్లాలో .. ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు
  • ఇల్లందులో రూ. 30 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో, ఎఫ్ బీవో​
  • మక్తల్​లో రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టివేత

ఇల్లందు/మక్తల్, వెలుగు: లంచం తీసుకుంటూ మంగళవారం వేర్వేరు చోట్ల ఐదుగురు ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎఫ్ఆర్వో, ఎఫ్​బీవో, నారాయణపేట జిల్లా మక్తల్​లో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి చిక్కారు. ఇల్లందు డివిజన్​లోని కొమరారం రేంజ్ ఆఫీస్​లో ఎఫ్ఆర్వో రెంటాల ఉదయ్ కుమార్, మాణిక్యారం బీట్ ఆఫీసర్  నునావత్  హరిలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై రమేశ్​ తెలిపారు. 

కొమరారం గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్​కు మట్టి రోడ్డు పని కోసం ఫారెస్ట్​ ల్యాండ్​ నుంచి గ్రావైల్​ తీసుకెళ్లేందుకు ఎఫ్ఆర్వో​డబ్బులు డిమాండ్​ చేయగా, గతంలో రూ.20వేలు ఇచ్చాడు. పనులు జరుగుతుండగా తన సిబ్బందిని పంపించి ట్రాక్టర్, జేసీబీని సీజ్​చేయించి, వాటిని రిలీజ్​ చేయడానికి రూ.15 వేలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా మళ్లీ రూ.50 వేలు డిమాండ్​ చేయగా, సదరు కాంట్రాక్టర్​ రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు డబ్బులను బీట్​ ఆఫీసర్​ హరిలాల్​కు ఇవ్వగా, రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

చార్జిషీట్​ కోసం రూ.20 వేలు డిమాండ్..

ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా చార్జిషీట్​ వేస్తానని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లా మక్తల్​ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నరసింహ, శివారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. వివారాల్లోకి  వెళితే.. మక్తల్ పట్టణంలో శ్రీనిధి కో ఆపరేటివ్  సొసైటీ డైరెక్టర్  సంధ్యా వెంకట్రాములు ఓ కేసులో నిందితుడు. ఆయనపై మక్తల్​ పోలీస్​ స్టేషన్​లో  కేసులు నమోదయ్యాయి. ఇటీవలే అయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్  మంజూరు చేసింది.

 ప్రతి సోమవారం ఆయన మక్తల్  పోలీస్  స్టేషన్‌‌కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా చార్జిషీట్  వేస్తానని చెప్పి సీఐ రూ.20 వేలు లంచం డిమాండ్  చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.20 వేలు కానిస్టేబుళ్లు​నరసింహ, శివారెడ్డికి ఇవ్వగా, రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వీరితో పాటు సీఐ చంద్రశేఖర్‌‌ను అదుపులోకి తీసుకొని మక్తల్  సర్కిల్  ఆఫీస్​లో సోదాలు నిర్వహించారు. సీఐ, కానిస్టేబుళ్లను  ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని మహబూబ్‌‌నగర్  ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.