ప్రతి 20 మందిలో ఐదుగురికి దగ్గు, సర్ది ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్​లో భారీగా ఓపీ

  • రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం 
  • చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెరిగిన పొల్యూషన్​
  • ఎయిర్ క్వాలిటీ తగ్గడంతో పలుచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసిన పీసీబీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి 20 మందిలో ఐదుగురు  దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఒక్క సారిగా చలి పెరగడంతో వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హైదరాబాద్ ​సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. ఫలితంగా ఎయిర్ క్వాలిటీ తగ్గి.. అస్వస్థతకు గురవుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఔట్​ పేషెంట్లు భారీగా పెరిగారు. ఇందులో ఎక్కువ మంది సర్ది, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఏం జ్వరమో తెలుసుకునేందుకు బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్, ఇటు ప్రభుత్వ ల్యాబ్స్, హాస్పిటల్స్​లో ఉన్న సమాచారం మేరకు రోజుకూ ఐదు వేల మందికి పైగా జ్వరం బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా జ్వరం, దగ్గు, జలుబు కేసులు యాక్టివ్​గా ఉన్నట్లు అంచనా. ఇక టెస్టులు చేసుకోకుండా.. తగ్గుతుందిలే అని చికిత్స తీసుకోకుండా సొంతంగా మెడిసిన్స్ కొనుగోలు చేసి వాడుతున్నోళ్లు అంతకు రెండుమూడు రెట్లకు పైనే ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్​ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. ప్రభుత్వ హాస్పిటల్స్​లోనూ కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉదయాన్నే లేచి పనులకు వెళ్లే పేద ప్రజలే ఎక్కువ సంఖ్యలో ఈ రోగాల బారిన పడుతున్నట్లు పలు రిపోర్టులు చెప్తున్నాయి.

ఎక్కడా చూసినా ఆ పేషెంట్లే

దగ్గు, జలుబు, జ్వరంతో ఎక్కువ మంది హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. సిటీలో ఒక ప్రైవేటు హాస్పిటల్ కు మూడు రోజులుగా వస్తున్న ఓపీల్లో 70 శాతం ఇవే కేసులు ఉన్నట్లు తెలిపారు. స్పెషలిస్టులకు సైతం ఇవే ఓపీలను కేటాయిస్తున్నారంటే తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆ హాస్పిటల్ డాక్టర్ ఒకరు చెప్పారు.

కొందరి పరిస్థితి ఐసీయూల్లో చికిత్స తీసుకునేంతలా ఉందన్నారు. ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ అయిన ఫీవర్, గాంధీ, ఉస్మానియా, బస్తీ దవాఖనాలు, ఇతర ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పూర్తిగా దగ్గు, జలుబు, జ్వరం బాధితులే క్యూ కడుతున్నరు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పీహెచ్​సీలో సోమ వారం నుంచి బుధవారం వరకు మూడు వేల మంది దాకా కేవలం దగ్గుతో కూడిన జ్వరంతో ఓపీకి వచ్చినట్లు తెలిసింది.

చలి, కాలుష్యంతో పెరుగుతున్న బాధితులు

రాష్ట్రంలో చలితోపాటు వాయు కాలుష్యం పెరుగుతున్నది. దీంతో జ్వరాలు, జలుబు, దగ్గు బాధితులు కూడా పెరుగుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోతున్నది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 100 లోపు ఉండాలి.

కానీ హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇది 140 నుంచి 170 మధ్యలో ఉన్నట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. ఇండస్ట్రీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటున్నది. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఏక్యూఐ 100 దాకా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.  లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12 వేల మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం 

వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై ఈ ప్రభావం ఉంటుంది. పిల్లలు, వృద్దులపై దీని ఎఫెక్ట్ అధికంగా ఉంటున్నది. జలుబు, దగ్గు, జ్వరం మాత్రమే కాకుండా భవిష్యత్​లో దీర్ఘకాలిక వ్యాధులను కలుగజేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం పిల్లలలో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని స్టడీలు వెల్లడిస్తున్నాయి. గాలి కాలుష్యం క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పొగ తాగనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం ఇదేనని తెలిసింది. ఇండియాలోనూ 2019లో గాలి కాలుష్యం వల్ల 16 లక్షల మంది చనిపోయినట్లు ది లాన్సెట్ జర్నల్​ రిపోర్ట్ వెల్లడించింది.  న్యుమోనియా, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో మాస్క్​ ధరించి ఉండటం మంచిదని... గోరు వెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు.