ఒకే రోజు ఐదుగురు మిస్సింగ్.. మైలార్ దేవ్పల్లిలో ఏం జరుగుతోంది

ఒకే రోజు ఐదుగురు మిస్సింగ్.. మైలార్ దేవ్పల్లిలో ఏం జరుగుతోంది
  • ఈ రెండు మూడ్రోజుల్లోనే ఘటనలు
  • భయాందోళనలో బాధిత కుటుంబాలు
  • ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్న పోలీసులు

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్ పల్లి పీఎస్​పరిధిలో ఐదుగురు మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరంతా ఈ రెండు మూడ్రోజుల్లోనే  కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. అలీనగర్ మైలార్ దేవ్ పల్లికి చెందిన ఎం.సత్తిబాబు కుమార్తె లక్ష్మీ దుర్గాభవాని(21) శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరో ఘటనలో బీహార్​లోని నాందేడ్ మండలానికి చెందిన గుడియా కుమారి, మింటు కుమార్ దంపతులు కొంతకాలంగా  మైలార్ దేవ్ పల్లిలోని సాయిబాబా నగర్​లో నివాసం ఉంటున్నారు.

 వీరి కుమార్తె లూసి (19) ఈ నెల 20న కాలేజీకి వెళ్లి తిరిగిరాలేదు. బంధువుల ఇండ్లలోనూ వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే ప్రాంతానికి చెందిన డొంకిన లింగం భార్య అనసూయమ్మ (87)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 21న ఉదయం కుటుంబసభ్యులంతా పనుల్లో నిమగ్నమై ఉండగా, ఇంటి గేటు తీసుకొని ఆమె బయటకు వెళ్లింది. చుట్టుపక్కల సైతం అనసూయమ్మ జాడ కనిపించలేదు. అలాగే శివరాజ్ శర్మ కూతురు తనియా గౌతమ్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా, స్విచాఫ్ వచ్చింది. 

వెంకటేశ్వర కాలనీకి చెందిన శ్రీకాంత్ (25) క్యాబ్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న తన భార్య స్రవంతికి ఫోన్ చేసి, శ్రీశైలం వెళ్తున్నానని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో స్రవంతి భయాందోళనకు గురవుతోంది. ఈ మిస్సింగ్ ఘటనలపై ఆయా కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.