రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్
  • పరారీలో ఇద్దరు వ్యక్తులు..ఐదుగురు అరెస్టు 
  • రెండు కమిషనరేట్లలో ఈ ముఠాపై 30  కేసులు

గచ్చిబౌలి, వెలుగు: రద్దీ ప్రదేశాలు, బస్సులు, ఆటోలు, రైళ్లలో ప్రయాణికులను టార్గెట్ చేసుకొని బంగారం, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న ఐదుగురు వ్యక్తులను ఆర్సీపురం పోలీసులు, మాదాపూర్​ సీసీఎస్​ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. ఆదివారం గచ్చిబౌలిలో  మాదాపూర్​ డీసీపీ వినీత్​తెలిపిన వివరాల ప్రకారం..   బీహెచ్‌ఈఎల్​ టౌన్​షిప్​కు చెందిన అనిశెట్టి శ్రీనివాస్​రావు ఈ నెల 25న సాయంత్రం 3.30 గంటల సమయంలో బాలానగర్‌‌కు వెళ్లేందుకు  కానుకుంట వద్ద ఉన్న సీఎంఆర్​షాపింగ్ మాల్​ వద్ద సికింద్రాబాద్​ బస్​ ఎక్కాడు. 

ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శ్రీనివాస్​రావు మెడలో ఉన్న 1.7 తులాల బంగారు గొలుసును వెనక నుంచి లాక్కెళ్లాడు. శ్రీనివాస్ రావు వెంటనే  ఆర్‌‌సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 30న రాత్రి 8 గంటలకు ఆర్​సీపురంలోని డైమండ్​ పాయింట్​ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మల్లెపల్లి మంగర్​ బస్తీకి చెందిన షూ పాలిష్​ చేసే బోలేనాథ్, ఆటో డ్రైవర్​ అబ్దుల్​ మన్నన్​, ఆసిఫ్ నగర్‌‌కు చెందిన ఆటో డ్రైవర్​మహమ్మద్​ఖదీర్​, మల్లెపల్లి అఫ్జల్​సాగర్​కు చెందిన లేబర్​ సికందర్​, నాంపల్లి అఫ్జల్​నగర్‌‌కు చెందిన ఆటో డ్రైవర్​ సునీల్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు.

  ఈ నెల 25న బస్సులో ఓ వ్యక్తి బంగారు గొలుసు చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు.  దీంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు. ఈ గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు మల్లెపల్లి అఫ్జల్​నగర్‌‌కు సికందర్, మక్కన్​ కసబ్​లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  వీరిందరూ కలిసి హైదరాబాద్​, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో మొత్తం 30 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ ముఠాపై ఆర్​సీపురం పోలీస్​ స్టేషన్​లో 3 కేసులు, మియాపూర్​లో 9 కేసులు, రాయదుర్గంలో 5 కేసులు, హుమాయూన్​నగర్​లో 4 కేసులు, చందానగర్​లో 3 కేసులు, కేపిహెచ్​బీలో2 కేసులు, ఫిల్మ్​నగర్​లో 2కేసులు, మాదాపూర్​ ఒకటి, బంజారాహిల్స్​లో ఒక కేసు నమోదైంది.