కొండపోచమ్మ సాగర్లో మునిగి ఐదుగురు మృతి

  • ఒకర్ని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకుల దుర్మరణం 
  • ఇంకో ఇద్దరు స్నేహితులు సురక్షితం
  • మృతులందరూహైదరాబాద్ వాసులు 
  • వీరిలో ఇద్దరు అన్నదమ్ములు

ములుగు/ముషీరాబాద్, వెలుగు: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో మునిగి ఐదుగురు యువకులు చనిపోయారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్ కు చెందిన గ్యార ధనుష్​(20), గ్యార లోహిత్​(18), బన్సీలాల్ పేట్​కు చెందిన చీకట్ల దినేశ్వర్​(17), ఖైరతాబాద్ చింతల్ బస్తీకి చెందిన ఉప్పల జతిన్​(17), అత్తాపూర్​ జనప్రియనగర్ కాలనీకి చెందిన సుతార్ సాహెల్ (18)తో పాటు మరో ఇద్దరు మృగాంక్, ఇబ్రహీం స్నేహితులు. 

వీరిలో ధనుష్​, లోహిత్ సొంత అన్నదమ్ములు. ధనుష్​  మినహా మిగతా వాళ్లు తీగల కృష్ణారెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. శనివారం బైకులపై కొండపోచమ్మ సాగర్ కు బయలుదేరారు. సాగర్​కు చేరుకుని అక్కడ కొంతసేపు సరదాగా గడిపారు. ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. 

లోపలికి వెళ్లడంతో.. 

కొద్దిసేపటికి అందరూ రిజర్వాయర్ ​లోపలి వైపునకు దిగారు. అక్కడ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో గ్యార ధనుష్​ కిందపడిపోయి మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు సోదరుడు లోహిత్ దిగడంతో అతనూ మునిగిపోయాడు. దీంతో వీళ్లిద్దరిని కాపాడేందుకు చీకట్ల దినేశ్వర్, ఉప్పల జతిన్, సుతార్​ సాహెల్ వెళ్లి వాళ్లూ మునిగిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు మునిగిపోయారు.

 ఇది చూసి మిగిలిన ఇద్దరు మిత్రులు కేకలు వేశారు. దీంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్లు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిద్దిపేట సీపీ అనురాధ, గజ్వేల్ ​ఏసీపీ పురుషోత్తంరెడ్డి, గజ్వేల్​ రూరల్ సీఐ మహేందర్​ రెడ్డి, ములుగు ఎస్సై విజయ్​కుమార్​స్పాట్​కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్ర వరకు ఒక్కొక్కటిగా విద్యార్థుల మృతదేహాలు బయటపడ్డాయి. 

మృతుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి డీసీసీ ప్రెసిడెంట్​టి.నర్సారెడ్డి, బీఆర్ఎస్​ నియోజకర్గ ఇన్ చార్జ్ ప్రతాప్​రెడ్డి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

తల్లిదండ్రులకు తీరని శోకం.. 

ముషీరాబాద్‌లోని ఇంద్రనగర్​కు చెందిన నర్సింగరావు, జయశ్రీ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తెకు వివాహం జరిగింది. ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్​గా పనిచేసే నర్సింగరావుకు పెద్ద కొడుకు ధనుష్​ సాయం చేస్తున్నాడు. చిన్న కొడుకు లోహిత్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీళ్లిద్దరూ మిత్రులతో కలిసి కొండపోచమ్మ సాగర్​కు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ నీళ్లలో మునిగి ఇద్దరూ చనిపోయారు. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.